హైదరాబాద్: ప్రముఖ అంకుర హాస్పిటల్స్ నెట్‌వర్క్‌కు చెందిన ‘అంకుర హాస్పిటల్స్ ఎ.ఎస్.రావు నగర్ ఎలఎల్‌పీ’ (AAD-3956) యొక్క వార్షిక నివేదికలు మరియు ప్రభుత్వ ఫైలింగ్స్‌ను పరిశీలిస్తే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకవైపు ఆదాయం సున్నాకు పడిపోవడం, మరోవైపు కోట్లాది రూపాయల బకాయిలు తీర్చివేయడం వంటి అంశాలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.  

ఆదాయం ‘జీరో’.. కానీ అప్పులు మాత్రం క్లియర్ ! 

ఈ హాస్పిటల్ ఫైలింగ్స్‌లో అత్యంత వింతైన విషయం ఏమిటంటే, 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 12.37 కోట్ల టర్నోవర్‌ను చూపించిన ఈ సంస్థ, 2022-23 మరియు 2023-24 సంవత్సరాల్లో తన ఆదాయాన్ని సున్నా (0) గా పేర్కొంది. అంటే రెండేళ్లుగా నయా పైసా ఆదాయం లేదని సంస్థ చెబుతోంది. ఆదాయం లేకపోయినప్పటికీ, 2024 జనవరిలో హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలను పూర్తిగా చెల్లించినట్లు ‘నో డ్యూస్ సర్టిఫికేట’(NO DUE CERTIFICATE)  పొందింది.  అలాగే, 2021 మార్చిలో ఇండసఇండ్ (INDUSIND) బ్యాంక్ నుంచి తీసుకున్న రూ. 98.70 లక్షల రుణాన్ని కూడా ఆదాయం పడిపోతున్న సమయంలోనే తీర్చివేసింది. నష్టాల్లో ఉన్న సంస్థకు ఈ అప్పులు తీర్చడానికి నిధులు ఎక్కడి నుండి వచ్చాయనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఆదాయం 2022 నుండి సున్నాగా ఉన్నప్పటికీ, భాగస్వాముల వ్యక్తిగత ఖాతాల ద్వారా సుమారు రూ. 2.98 కోట్ల నిధులు చలామణిలో ఉన్నాయి. ఆదాయం లేని సంస్థలోకి ఈ నిధులు ఎక్కడి నుండి వచ్చాయనేది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 68 ప్రకారం నిరూపించాల్సి ఉంటుంది. సరైన ఆధారాలు లేకపోతే, వీటిని బినామీ నిధులుగా లేదా అక్రమ నగదు క్రెడిట్లుగా పరిగణించే అవకాశం ఉంది. 

ఇతర ఖర్చులు.. అడిటర్ ఫీజుల మాయాజాలం ? 

టర్నోవర్ ఏమాత్రం లేని కాలంలో కూడా సంస్థ భారీ ఖర్చులను చూపించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం సున్నా అయినప్పటికీ, అడిటర్లకు రూ. 3,00,000 ఫీజుగా చెల్లించినట్లు రికార్డులు చెబుతున్నాయి.  అంతేకాకుండా, 2016-17 సమయంలో ‘ఇతర ఖర్చులు’ (Other Expenses)) ఒక్కసారిగా రూ. 55 లక్షల నుండి రూ. 3.20 కోట్లకు పెరిగాయి. కేవలం ఒక్క ఏడాదిలోనే ఖర్చులు దాదాపు 5 రెట్లు పెరగడం ఫోరెన్సిక్ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వ్యాపారం పెరగకుండానే ఖర్చులు 5 రెట్లు పెరగడం అనేది లాభాలను తగ్గించి చూపడానికి సృష్టించిన బోగస్ ఖర్చులు కావచ్చు. ఇది సెక్షన్ 37 ప్రకారం పన్ను ఎగవేత కిందకు వస్తుంది.

ఇన్వెంటరీ ఎక్కడికి పోయింది? 

2021-22 చివరి నాటికి సంస్థ వద్ద రూ. 39.37 లక్షల విలువైన స్టాక్ (Inventory) ఉంది. కానీ 2022-23 నివేదికలో ఆ స్టాక్ విలువను సున్నాగా చూపించారు. సాధారణంగా స్టాక్ తగ్గిందంటే అది అమ్ముడైనట్లు లెక్క, కానీ ఆ ఏడాది ఆదాయం (Turnover) కూడా సున్నా అని పేర్కొన్నారు. మరి ఆ స్టాక్ అంతా ఏమైంది? అనేది పన్ను శాఖ అధికారుల దృష్టిని ఆకర్షించే అంశం.  

భాగస్వాముల మధ్య భారీ నిధుల మార్పిడి ? 

నివేదికల ప్రకారం, సంస్థలో భాగస్వాముల పెట్టుబడి (Contribution) కేవలం రూ. 10 లక్షలు మాత్రమే. కానీ ‘పార్ట్నర్స్ కరెంట్ అకౌంట’ మరియు ఇతర లయబిలిటీస్ కింద దాదాపు రూ. 2.98 కోట్లు సంస్థలో ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణ ప్రసాద రావు వున్నం మరియు శ్రీనిధి తిరునగరి వంటి ముఖ్యమైన వ్యక్తులు ఈ సంస్థతో పాటు మరో 10కి పైగా ఇతర సంస్థల్లో డైరెక్టర్లుగా లేదా భాగస్వాములుగా కొనసాగుతున్నారు.  కేవలం రూ. 10 లక్షల పెట్టుబడి ఉన్న సంస్థలో రూ. 3 కోట్ల వరకు ఇతర నిధులు ఉండటం, ఆదాయం లేకపోయినా బ్యాంక్ అప్పులు తీర్చడం చూస్తుంటే.. ఈ సంస్థను కేవలం నిధుల మళ్లింపు కోసం ఉపయోగిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

డీమ్డ్ డివిడెండ్ ఉల్లంఘనలు: 

సంస్థ వద్ద ఆపరేషనల్ ఆదాయం లేకపోయినా, 2025 నాటికి రూ. 3.02 కోట్ల విలువైన లోన్లు మరియు అడ్వాన్స్‌లు (Loans and Advances) ఆస్తుల రూపంలో ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 2(22)(వ) ప్రకారం, ఒక సంస్థ తన భాగస్వాములకు లేదా వారికి సంబంధం ఉన్న ఇతర సంస్థలకు ఇచ్చే రుణాలను ‘డీమ్డ్ డివిడెండ’గా పరిగణించి పన్ను విధిస్తారు. ఈ భారీ అడ్వాన్స్‌లు పన్ను ఎగవేతకు మార్గంగా మారే ప్రమాదం ఉంది. 
ఈ ఆధారాలను బట్టి చూస్తే, అంకుర హాస్పిటల్స్ ఎ.ఎస్.రావు నగర్ ఎలఎల్‌పీ ఒక హాస్పిటల్‌గా కాకుండా, కేవలం నిధులను ఒక చోటు నుండి మరో చోటుకు మార్చే “ఫైనాన్షియల్ క్లియరింగ్ హౌస”లా పనిచేస్తుందనే అనుమానాలు బలపడుతున్నాయి. దీనిపై సీరియస్ ఐటి ఇన్వెస్టిగేషన్ అవసరమని ఫోరెన్సిక్ నివేదికలు సూచిస్తున్నాయి.