Ticker

6/recent/ticker-posts

My Land Infra : రియల్ ఎస్టేట్ ముసుగులో ‘మై ల్యాండ్ ఇన్‌ఫ్రా’ మహా మోసం

  • రియల్ ఎస్టేట్ ముసుగులో ‘మై ల్యాండ్ ఇన్‌ఫ్రా’ మహా మోసం: 
  • నెలకి రూ. 10 వడ్డీ ఆశచూపి 80 కోట్ల డిపాజిట్ల మాయాజాలం!

రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో సాగుతున్న ఒక భారీ పొంజీ స్కామ్ గుట్టురట్టయింది. ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల విక్రయాల ముసుగులో మల్టీలెవల్ మార్కెటింగ్ (MLM) దందా నడుపుతూ, సామాన్యుల నడ్డి విరుస్తున్న ‘మై ల్యాండ్ ఇన్‌ఫ్రా డెవలపర్స’ (MY LAND INFRA DEVELOPERS) సంస్థ అసలు రంగు బయటపడింది. నెలకి లక్ష పెట్టుబడికి ఏకంగా రూ. 10 రూపాయల వడ్డీ (నెలవారీ గ్యారెంటీ రిటర్న్స్) ఇస్తామంటూ కళ్ళు చెదిరే ఆఫర్లతో మార్కెట్లోకి వచ్చిన ఈ మనీ సర్క్యులేషన్ మాఫియాపై ఇప్పుడు ఆర్థిక నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సాధారణ రియల్ ఎస్టేట్ సూత్రాలను పక్కనబెట్టి, చట్టవిరుద్ధమైన చైన్ సిస్టమ్ నడుపుతున్న ఈ మాయా సంస్థ ఎప్పుడైనా బోర్డు తిప్పేసే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 4 రకాల ‘మాయా’ స్కీమ్‌లు.. ఇవే అసలు లొసుగులు!

ఖాతాదారులను నమ్మించి, వారి నుంచి ముక్కుపిండి పెట్టుబడులు వసూలు చేయడానికి ‘మై ల్యాండ్ ఇన్‌ఫ్రా’ నాలుగు రకాల ఘరానా స్కీమ్‌లను ఎరగా వేసింది. వాటి వెనుక ఉన్న నగ్న సత్యాలు ఇవే:

స్కీమ్ - 1 (గోల్డ్ కాయిన్ ట్రాప్): రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే, రూ.5 లక్షల విలువైన గోల్డ్ కాయిన్స్, రూ. 5 లక్షల ల్యాండ్ అగ్రిమెంట్ ఇస్తారు. 20 నెలల పాటు నెలకు రూ. 1 లక్ష చొప్పున వెనక్కి ఇస్తామంటారు. కానీ ట్విస్ట్ ఏంటంటే.. ప్రతి నెల వచ్చే అమౌంట్‌తో పాటు కస్టమర్ ఆ గోల్డ్ కాయిన్స్‌ను కంపెనీకి తిరిగి ఇచ్చేయాలి!
 

స్కీమ్ - 2 (కంటితుడుపు మార్టిగేజ్): రూ. 10 లక్షల పెట్టుబడికి రూ. 5 లక్షల బంగారం ఇస్తూ, మిగిలిన మొత్తానికి ల్యాండ్ మార్టిగేజ్ చేస్తారు (ఆ చార్జీలు కూడా కస్టమరే భరించాలి). 30 నెలల పాటు నెలకు రూ.50,000 ఇస్తామని మభ్యపెడతారు. అసలు తిరకాసు ఏంటంటే.. కంపెనీ వెంచర్లు వేసిన చోట అసలు భూమే లేదు! మార్టిగేజ్ పేరుతో కాలయాపన చేస్తూ కస్టమర్లను ముంచడమే వీరి ప్లాన్.
 

స్కీమ్ - 3 (బోగస్ అగ్రిమెంట్లు): రూ.10 లక్షలు కడితే రూ.7.5 లక్షల బంగారం, రూ. 2.5 లక్షల ల్యాండ్ అగ్రిమెంట్ రాసిస్తారు. 36 నెలల పాటు నెలకు రూ. 28,000 ఇస్తారు. అయితే, ఈ అగ్రిమెంట్లన్నీ పూర్తిగా కంపెనీకి అనుకూలమైన నిబంధనలతో ఉంటాయి తప్ప, కస్టమర్లకు రూపాయి రక్షణ ఉండదు.
 

స్కీమ్ - 4 (లాంగ్ టర్మ్ ప్లాన్ - బోర్డు తిప్పేసే పక్కా స్కెచ్): రూ. 10 లక్షల పెట్టుబడికి రూ.2.5 లక్షల బంగారం, రూ. 2.5 లక్షల వెండి ఇచ్చి, రూ. 5 లక్షలకు 100 గజాల ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తారు. 40 నెలల పాటు నెలకు రూ. 25,000 ఇస్తారు. ఎక్కువ నెలల గడువు పెట్టడం ద్వారా కంపెనీపై తక్షణ ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది, కస్టమర్లలో నమ్మకం పెరుగుతుంది. ఆ నమ్మకంతో మరిన్ని వందల కోట్లు వసూలు కాగానే రాత్రికి రాత్రే బోర్డు తిప్పేయాలన్నదే సంస్థ అంతర్గత వ్యూహం. ష్యూరిటీ ఇచ్చి రూ. 10 వడ్డీ ఇచ్చే సంస్థలు ఎక్కడైనా ఉన్నాయా ? ఎవరైనా సొంత లాభం చూసుకుంటారు కానీ కస్టమర్లకు ఇవ్వటం ఎక్కడైనా ఉందా ? ఇక్కడే అతిపెద్ద మాయాజాలం ఉంది అని ప్రజలు గమనించాలి.

ఏజెంట్ల కమీషన్ కక్కుర్తి.. బలి అవుతున్న సామాన్యులు

కస్టమర్లకు ఎలాంటి రక్షణ లేని ఇటువంటి ప్రమాదకరమైన స్కీమ్‌ల వైపు మళ్లించడానికి ఏజెంట్లకు భారీగా కమీషన్లు ఆశచూపారు. ఒక్కో కస్టమర్ నుంచి రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టిస్తే ఏజెంట్లకు 5% నుండి అదనంగా మరో 2% వరకు (ష్యూరిటీ లేని ప్లాన్లపై) కమీషన్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ కమీషన్ల కక్కుర్తిలో పడి ఏజెంట్లు అమాయక ప్రజలను ఈ ఊబిలోకి లాగుతున్నారు.

ఆర్బీఐ (RBI) చట్టాల ఉల్లంఘన: కోట్లలో పెనాల్టీ.. 5 ఏళ్ల జైలు!

ప్రజల నుంచి ఇలా డిపాజిట్లు వసూలు చేయడం పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) స్పష్టం చేస్తోంది. ప్రజల నుండి పెట్టుబడులు లేదా డిపాజిట్లు సేకరించాలంటే NBFC (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ) మరియు RBI లైసెన్స్ తప్పనిసరి. అనుమతులు లేకుండా ఇలాంటి అక్రమ దందాకు పాల్పడితే ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(S) మరియు 58 B (5A) ప్రకారం అత్యంత శిక్షార్హమైన నేరం. ఈ నేరానికి గాను 1 కోటి నుండి 25 కోట్ల వరకు పెనాల్టీ, ప్రజల నుంచి సేకరించిన మొత్తానికి రెండింతల జరిమానా లేదా 5 ఏళ్ల కఠిన జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

 వైజాగ్‌తో పాటు 12 ప్రాంతాల్లో ఫ్రాంచైజీల మాయాజాలం!

వైజాగ్ వేదికగా నెట్‌వర్క్ మార్కెటింగ్ దందాను ప్రారంభించిన ఈ ‘మై ల్యాండ్ ఇన్‌ఫ్రా’, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మరో 12 ప్రధాన కేంద్రాలకు విస్తరించింది. స్థానికంగా ఉండే వ్యక్తులకు ఫ్రాంచైజీలను ఆఫర్ చేస్తూ, అసలు యజమానుల చేతికి మట్టి అంటకుండా, రేపు ప్రమాదం వస్తే ఫ్రాంచైజీ నిర్వాహకులను బలిపశువులను చేసేలా పక్కా స్కెచ్ వేశారు. భారతదేశంలో ‘ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (బ్యానింగ్) యాక్ట’ ప్రకారం ఈ చైన్ సిస్టమ్ పూర్తిగా నిషేధించబడింది.

లీగల్ డాక్యుమెంట్లు శూన్యం.

ఈ కంపెనీ లొసుగులను లోతుగా పరిశీలిస్తే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి

MCA రిజిస్ట్రేషన్ లేదు: కంపెనీ స్థాపించి 18 నెలలు దాటినా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (MCA) లో దీనికి సంబంధించిన ఎలాంటి రికార్డులు లేవు. అసలు చట్టపరంగా ఈ కంపెనీ ఉనికిలోనే లేదు!
జీఎస్టీ (GST) లేదు: కనీసం ప్రభుత్వానికి పన్ను కట్టే జీఎస్టీ నెంబరు కూడా గూగుల్‌లో ఎంత వెతికినా కనిపించటం లేదు.
నకిలీ హోదాలు: లీగల్ డాక్యుమెంట్‌లో ప్రొప్రైటర్‌గా ఉన్న వైశ్యరాజు శ్రీనివాసరాజు, బయట మాత్రం మేనేజింగ్ డైరెక్టర్ (M.D) అని, ఆయన భార్య వైశ్యరాజు శైలజ ‘సీఈఓ’ (C.E.O) అని నకిలీ హోదాలతో చలామణి అవుతున్నారు.
డమ్మీ హెల్ప్‌లైన్: కస్టమర్లను నమ్మించడానికి వెబ్‌సైట్‌లో కోట్లాది రూపాయల ప్రాజెక్టుల గ్రాఫిక్స్ చూపించారు తప్ప, సంప్రదించడానికి కనీసం ఫోన్ నెంబర్ కూడా పనిచేయటం లేదు.

 ప్రజలారా.. పారాహుషార్!

రియల్ ఎస్టేట్ ముసుగులో, కళ్ళు చెదిరే వడ్డీల ఆశ చూపిస్తూ మీ కష్టార్జితాన్ని దోచుకోవడానికి పొంచి ఉన్న ఇటువంటి నకిలీ సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండండి. మోసపూరిత ఏజెంట్ల మాటలు నమ్మి అక్రమ డిపాజిట్ స్కీమ్‌లలో పెట్టుబడులు పెట్టి జీవితాలను రోడ్డున పడేసుకోవద్దని ఆర్థిక నిపుణులు మరియు చట్టబద్ధమైన సంస్థలు హెచ్చరిస్తున్నాయి.





Post a Comment

0 Comments