Ticker

6/recent/ticker-posts

Sri Chaitanya Fake Olympiads : ఆగని శ్రీచైతన్య ఫేక్‌ ఒలింపియాడ్స్‌ దందా !

  • గతంలోనే వెలుగులోకి తీసుకొచ్చిన ప్రజాస్వామ్యం ఆన్‌లైన్‌ న్యూస్‌ ! 
  • గుట్టుచప్పుడు కాకుండా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న శ్రీచైతన్య !  
  • సమాచారం లేకుండా వెబ్‌సైట్స్‌ డిలీట్‌ చేసి శ్రీచైతన్య మెటా యాప్‌లో నిర్వహణ !  
  • తల్లిదండ్రుల కష్టాన్ని జలగల్లా జుర్రేస్తున్న శ్రీచైతన్య. 
  • ఒలింపియాడ్స్‌ను బ్యాన్‌ చేయాలంటున్న తల్లిదండ్రులు !  
  • ఎన్ని విన్నపాలు చేసిన చర్యలు తీసుకోని ప్రభుత్వాలు ! 

ఇప్పటి దాకా లాండ్‌ మాఫియా చూశాం, శాండ్‌ మాఫియా చూశాం, మైన్స్‌ మాఫియా చూశాం, లిక్కర్‌ మాఫియా చూశాం...ఇప్పుడు కొత్తగా ఒలింపియాడ్స్‌ మాఫియా వచ్చేసింది. ఈ మాఫియా ఒక్క తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు, అనతికాలంలోనే దేశం అంతా విస్తరించింది. శ్రీచైతన్య స్కూల్స్‌ ఇందుకు వేదిక అయ్యింది. శ్రీచైతన్య స్కూల్స్‌లో ఫీజులే కాకుండా ఇతర పేర్లతో డబ్బులు గుంజుకుంటున్నా పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు మౌనంగానే భరిస్తూనే ఉన్నారు. కానీ శ్రీచైతన్య దోపిడీ ఆశకు అంతే లేదు. పెద్దపెద్ద గుర్తింపు పొందిన సంస్థలు నిర్వహించే ఒలింపియాడ్స్‌ మీద శ్రీచైతన్య కన్ను పడిరది. ఒలింపియాడ్స్‌ ద్వారా ఇతర పెద్ద సంస్థలకు పోతున్న సొమ్ముపై తన సంస్థలోకి మళ్ళించుకునే పథకం రూపొందించింది. అనుకున్నదే తడవుగా శ్రీచైతన్య సంస్థ ఒక బినామీ సంస్థను నెలకొల్పింది. INTSO (ఇండియన్‌ నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఒలింపియాడ్‌),  KAT (నాలెడ్జ్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌)ల పేరుతో పెద్ద పెద్ద గుర్తింపు పొందిన సంస్థలు నిర్వహించే ఒలింపియాడ్‌ ఎగ్జామ్స్‌కు దగ్గరగా ఉండేలా రకరకాల పేర్లతో  నకిలీ (FAKE OLYMPIADS) ఒలింపియాడ్స్‌ను రూపొందించింది. శ్రీచైతన్య టీచర్స్‌తోనే పేపర్లు తయారు చేయిస్తోంది. తల్లిదండ్రులను ఏమార్చి అడ్డంగా దోచేస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రజాస్వామ్యం వెబ్‌న్యూస్‌ ద్వారా వెలుగులోకి తీసుకురావటంతో శ్రీచైతన్య వెనక్కి తగ్గినట్టు నటించింది. FAKE OLYMPIADSకు సంబంధించిన వెబ్‌సైట్స్‌ను డిలీట్‌ చేసింది. అక్రమ సంపాదనకు అలవాటు పట్ట శ్రీచైతన్య తన బాణిని మార్చుకోలేకపోయింది. శ్రీచైతన్యలో చదివే లక్షలాది మందిని దోచుకోవడానికి తన ఫేక్‌ ఒలింపియాడ్స్‌ను ఆన్‌లైన్‌ వేదికకు మార్చింది. శ్రీచైతన్యకు చెందిన ఇన్ఫినిటీ మెటా యాప్‌లో ఎగ్జామ్స్‌ను నిర్వహిస్తోంది. శ్రీచైతన్యలో చదివే విద్యార్థులను ఇతర గుర్తింపు పొందిన సంస్థల ఒలింపియాడ్స్‌కు వ్రాయకుండా కట్టడి చేస్తోంది. శ్రీచైతన్యలో దేశవ్యాప్తంగా చదువుతున్న లక్షలాది మంది అమాయక విద్యార్థులను తన దోపిడీకి అనుకూలంగా మలచుకుంది. ఈ తతంగానికి తన సొంత మనుషులను వాడుకుంటోంది. ఐఎన్‌టీఎస్‌ఓ ఎడ్యుకేషన్‌ పేరుతో విజయవాడలో ఒక సంస్థను రిజిస్టర్‌ చేసింది. దీంతో అసలైన ఒలింపియాడ్స్‌ స్థానంల నకిలీ (ఫేక్‌) ఒలింపియాడ్స్‌ నిర్వహిస్తోంది. తల్లిదండ్రుల కష్టాన్ని జలగలా జుర్రేస్తూ మధ్యతరగతి తల్లిదండ్రుల నడ్డి విరుస్తోంది. వారిని అప్పుల పాలు చేస్తోంది.

INTSO EDUCATION  పేరుతో 5 ఒలింపియాడ్స్‌.

దేశవ్యాప్తంగా ఎంతో పేరుప్రఖ్యాతులు ఉన్న ఒలింపియాడ్‌ ఎగ్జామ్స్‌కు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మ్యాథ్స్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఒలింపియాడ్‌ (MTSO), ఆప్టిట్యూడ్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఒలింపియాడ్‌ (ATSO) , ఇంగ్లీష్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఒలింపియాడ్‌ (ETSO) , సైన్స్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఒలింపియాడ్‌ (STSO) , జి.కె. టాలెంట్‌ సెర్చ్‌ ఒలింపియాడ్‌ (GTSO) పేరుతో అచ్చంగా ఒలింపియాడ్స్‌ను పోలిన విధంగా పేర్లు పెట్టి మొత్తం 5 రకాల ఒలింపియాడ్స్‌ను నిర్వహిస్తోంది శ్రీచైతన్య. ఈ ఒలింపియాడ్‌ పరీక్షల కోసం అన్నీ శ్రీచైతన్య స్కూల్స్‌లో ఉన్న విద్యార్థులందరిపై అదనపు భారం మోపుతోంది. 5 రకాల ఒలింపియాడ్స్‌ కోసం ఒక్కో పరీక్షకు రూ. 150/- చొప్పున 5 పరీక్షలకు గాను రూ. 750/- వసూలు చేస్తోంది శ్రీచైతన్య. 2024-25 విద్యాసంవత్సరానికి 4 లక్షల మంది విద్యార్థుల దగ్గర నుండి రూ. 750/- చొప్పున రూ.30 కోట్లు వసూలు చేసింది. గత 10 సంవత్సరాలుగా ఈ దోపిడీని నిరంతరాయంగా కొనసాగిస్తోంది. ఇలా ఎవరు పడితే వారు ఒలింపియాడ్స్‌ పేరును వాడుకుంటూ, ఇష్టానికి పరీక్షలను నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఐఎన్‌టీఎస్‌ఓ ఎడ్యుకేషన్‌ సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యను వేళ్ళపైనే లెక్కపెట్టవచ్చు. ఈ సంస్థకు ఒలింపియాడ్స్‌ రేంజ్‌లో ఆ స్టాండర్ట్స్‌ను అందుకునే ఉపాధ్యాయులు లేరు. వీరికంటూ విద్యారంగంలో సరైన గుర్తింపు లేదు. వీరికి ఉన్నదల్లా శ్రీచైతన్య అండదండలు మాత్రమే. పేపర్లు తయారు చేయటం దగ్గర నుండి పరీక్షలు నిర్వహించే బాధ్యత అంతా శ్రీచైతన్య స్కూల్స్‌ మరియు కాలేజీ ప్రిన్సిపాల్స్‌దే బాధ్యత. 90% మంది ప్రిన్సిపాల్స్‌కి శ్రీచైతన్య బినామీ ఒలింపియాడ్‌ అని తెలియకుండానే ఆయా స్కూల్స్‌లో నిర్వహించటం గమనార్హం. ఇంకా విచిత్రం ఏమిటంటే  దేశవ్యాప్తంగా శ్రీచైతన్య స్కూల్స్‌లో చదివే విద్యార్థులు, శ్రీచైతన్య మేనేజ్‌మెంట్‌ అనుబంధంగా నడిచే ప్రైవేట్‌ స్కూల్స్‌లో చదివే విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షల్లో పాల్గొంటారు. ఇంకా వేరెక్కడా ఈ పరీక్షలు నిర్వహించటం లేదు. శ్రీచైతన్య ధనదాహం ఎలాంటిదో ఇక్కడే అర్థం అవుతోంది. 

నాలెడ్జ్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ (KAT)

KNOWLEDGE APTITUDE TEST (KAT) అనే ఓ ప్రముఖ సంస్థను కాపీ చేస్తూ KNOWLEDGE ASSESSMENT TEST (KAT) పేరుతో మరో 3 రకాల ఒలింపియాడ్స్‌ను నిర్వహిస్తోంది శ్రీచైతన్య. దీనికి కనీస గుర్తుంపు లేదు. అడ్రస్‌, ఫోన్‌ నంబర్‌లు ఫేక్‌. కానీ పరీక్షలు మాత్రం ఒక్క శ్రీచైతన్య విద్యాసంస్థల్లో నిర్వహిస్తోంది. 6 వ తరగతి నుండి 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులను టార్గెట్‌ చేసుకుంది. ప్రతి ఎగ్జామ్‌కి చివరన ఒలింపియాడ్‌ అనే పదం చేర్చి విద్యార్థులను, తల్లిదండ్రులను నిలువుదోపిడీ చేస్తోంది. ఒక ఊరు, పేరు లేకుండా శ్రీచైతన్య ఎలా నిర్వహిస్తోంది అనేది శ్రీచైతన్య తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలి. మ్యాథమేటిక్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ (MAT), ఫిజిక్స్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ (PAT), కెమిస్ట్రీ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ (ChAT) పేరుతో ఒలింపియాడ్స్‌ నిర్వహిస్తోంది. ప్రతీ పరీక్షకు రూ. 200 /- వసూలు చేస్తోంది. మూడు పరీక్షలకు గాను రూ. 600/- లతో దాదాపు 2 లక్షల మంది విద్యార్థుల దగ్గర నుండి రూ. 12 కోట్లు వసూలు చేస్తోంది. గత 10 ఏళ్ళుగా దాదాపు 120 కోట్లు వసూలు చేసింది శ్రీచైతన్య. ఫీజులు చాలదన్నట్టు ఇదో రకమైన దోపిడీకి తెరతీసి...లేని పోటీ ప్రపంచాన్ని సృష్టించి పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమను, వారి భవిష్యత్తును ఆసరా చేసుకుని అడ్డు అదుపు లేకుండా దోచుకుంటోంది. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం స్కూల్‌ వ్యవస్థను దోపిడీకి అడ్డాగా మార్చుకుంది.

ఒలింపియాడ్స్‌ను రద్దు చేయటమే పరిష్కారం ! 

దేశవ్యాప్తంగా కొన్ని ప్రఖ్యాత సంస్థలు నిర్వహించే ఒరిజినల్‌ ఒలింపియాడ్స్‌ను శ్రీచైతన్య పూర్తిగా ప్రక్కకు పెట్టేసింది. వాటి స్థానం శ్రీచైతన్య బినామీ ఒలింపియాడ్స్‌ను నిర్వహించటం గమనార్హం. అసలు INTSO EDUCATION, KAT వంటి ప్రైవేట్‌ సంస్థలు నిర్వహించే ఒలింపియాడ్‌ ఎగ్జామ్స్‌కు ప్రభుత్వం నుండి ఎలాంటి గుర్తింపు లేదు. కార్పొరేట్‌ సంస్థలు నిర్వహించే ఇటువంటి పరీక్షలను పూర్తిగా నిషేధం విధించాల్సి ఉంది. ఇలాంటి పరీక్షల వలన ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా, పిల్లలపై అనవసర ఒత్తిడి పెంచతున్నామనే విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. మేధావులు ఇకపై గళమెత్తి శ్రీచైతన్యను ప్రశ్నించాల్సి ఉంది. తల్లిదండ్రులు శ్రీచైతన్య దోపిడీని ఎదురించి పోరాడాల్సి ఉంది. ఇలాంటి ఫేక్‌ ఒలింపియాడ్స్‌ పట్ల జాగ్రత్త వహిస్తూ, మోసాల పట్ల తల్లిదండ్రులే జాగరూకతతో వ్యహరించాలి. గత దశాబ్దకాలంగా దాదాపు 3.2 మిలియన్ల విద్యార్థులతో పరీక్షలు వ్రాయించి సుమారు రూ. 240 కోట్ల సొమ్ము లూటీ చేసింది. ఈ సొమ్ము అంతా ఎవరి జేబులోకి వెళుతోంది అని చిదంబర రహస్యం. ఆయా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు 150 ల్యాప్‌టాప్‌లు, మెడల్స్‌, కన్సోలేషన్‌ బహుమతులు, మెరిట్‌ సర్టిఫికేట్‌లు ప్రదానం చేసి మిగిలిన కోట్లాది రూపాయలు దండుకుంటోంది. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థల్కెన సి.బి.ఐ, ఈడీలతో దర్యాప్తు చేయించవలసిన అవసరం ఎంతైనా ఉంది. 

Post a Comment

0 Comments

Popular Posts

Resonance Schools : J.D.లక్ష్మీనారాయణ రెజొనెన్స్‌కి ప్రచారకర్తగా మారారా ?
Resonance Schools : టీచర్లు లేకుండా బోధన ఎలా ?
Kadapa Sri Chaitanya : శ్రీచైతన్య హాస్టల్స్‌లో ఆగని మరణమృదంగం !
Physics Wallah : 'సరసమైన ధరకే చదువు' ఫిజిక్స్‌ వాలా IPOని గట్టెక్కిస్తుందా ?
Sri Chaitanya Fake Olympiads : ఆగని శ్రీచైతన్య ఫేక్‌ ఒలింపియాడ్స్‌ దందా !
Sri Chaitanya Score Scholarship : శ్రీచైతన్య రూ.350 కోట్లు మాయాజాలం !
sri chaitanya : తవ్వేకొద్ది బయటపడుతున్న శ్రీచైతన్య షెల్‌ కంపెనీల అక్రమాలు !
Resonance Schools : పర్మిషన్లు లేకుండా అడ్మిషన్లు ఎలా ?
Sri Chaitanya Sisters : శ్రీచైతన్య షెల్‌ కంపెనీల గుట్టు రట్టు !
Sri Chaitanya Prodigy : తల్లిదండ్రులపై మోయలేని పెనుభారం !