కడప జిల్లా చింతకొమ్మదిన్నెలోని శ్రీచైతన్య స్కూల్ హాస్టల్‌లో జరిగిన ఈ ఘటన ప్రాంతాన్ని కుదిపేసింది. 9వ తరగతి విద్యార్థిని జశ్వంతి తన గదిలో ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది. జశ్వంతి ఆత్మహత్యపై మృతురాలి తల్లిదండ్రులకు సరైన సమాచారం ఇవ్వకుండా స్కూల్ యాజమాన్యం రిమ్స్ ఆస్పత్రికి తరలించడంపై బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.జశ్వంతి మృతిపై పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు ఆమె మృతిపై పేరెంట్స్ అనుమానం ఉన్నట్లు తెలిపారు. తమ కుమార్తె పరిస్థితిపై ముందుగా సమాచారం ఇవ్వకుండా ఆస్పత్రికి ఎలా తరలించారని వారు యజమాన్యాన్ని వారు ప్రశ్నించారు. యాజమాన్యం తరఫున వస్తున్న వేధింపులు, ఒత్తిడి కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జశ్వంతి మృతదేహాన్ని మార్చురీ నుంచి స్కూల్‌కు తీసుకెళ్లి నిరసన తెలపడానికి బంధువులు యత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఘర్షణ చోటుచేసుకుంది. బంధువులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. స్ట్రెచర్‌పై మృతదేహాన్ని ఇరువైపులా లాగుతూ జరిగిన దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి.పొంతన లేని సమాధానాలు !
కాగా, అయితే జశ్వంతి స్కూల్ లో అనారోగ్యానికి గురికావడంతో మేనేజ్ మెంట్ రిమ్స్‌కు తరలించినట్లు తెలిపింది. అయితే అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు డిక్లేర్ చేశారు. అయితే తమ కుమార్తె మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొదట కళ్లు తిరిగి పడిపోయిందని.. ఆ తర్వాత ఉరి వేసుకుని చనిపోయిందని సమాచారం ఇచ్చారంటున్నారు తల్లిదండ్రులు. తమ కుమార్తెను యాజమాన్యం చంపిందని ఆరోపిస్తున్నారు. అసలు మా అమ్మాయి ఎందుకు ఊరి వేసుకుంది.. నా కూతురు ఎంతో ధైర్యంగా ఉంటూ.. చదువులో ఎంతో చురుకుగా ఉంటుంది. అయినప్పటికి అసలు ఆత్మహత్య చేసుకోవాల్సిన పిరికిది కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థిని మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విచారణ కోరుతూ డిమాండ్
విద్యార్థిని మరణంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఘటనపై నిష్పాక్షిక విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హాస్టల్ సిబ్బంది, స్కూల్ యాజమాన్యం నుంచి వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థినిపై ఏవైనా ఒత్తిడి, వేధింపులు ఉన్నాయా అన్న దానిపై విచారణ కొనసాగుతోందని స్థానిక సిఐ తెలిపారు. బాలిక రూమ్ నుండి వ్యక్తిగత సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సీసీ పుటేజ్‌తో పాటు విద్యార్థుల వాంగ్మూలాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.
శ్రీచైతన్య హాస్టల్స్‌లోనే ఎందుకు ?
శ్రీచైతన్య యాజమాన్యానికి సంపాదన మీద ఉన్న శ్రద్ధ విద్యార్థులపై ఉండటం లేదు. ఒకటి కాదు రెండు కాదు ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో విద్యార్థులు శ్రీచైతన్య హాస్టల్స్‌లో విగతజీవులుగా మారుతున్నాయి. అయినా యాజమాన్యానికి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. కేసు నమోదు చేసుకోవటం దర్యాప్తు పేరుతో కాలం వెళ్ళదీయటం చివరకు ఎలాంటి న్యాయం జరగగా తల్లిదండ్రులు తల్లడిల్లిపోవటం ఎళ్ళతరబడి కొనసాగుతూనే ఉంది. కానీ యాజమాన్యం విద్యార్థుల ఆత్మహత్యకు కారణాలు అన్వేషించటం, వారి మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవటం లేదు. క్యాంపస్‌లలో కనీసం కౌన్సిలింగ్ సెషన్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి విద్యార్థుల్లో మార్కుల కంటే జీవితం గొప్పది అని వారిలో ఆత్మవిశ్వాసం నింపిన దాఖలాలు లేవు. శ్రీచైతన్యలో చేర్పిస్తే చావును కొనితెచ్చుకున్నట్లే అని తల్లిదండ్రుల్లో ఒక రకమైన అభిప్రాయం బలంగా నాటుకుపోతోంది.
0 Comments