- స్కోర్ స్కాలర్‌షిప్ ఫలితాలు కేవలం ఆన్‌లైన్‌కే పరిమితం.
- బహిరంగ పరిచేందుకు విముఖం.
- రూ. 350 కోట్ల స్కాలర్‌షిప్ పొందిన విద్యార్థుల జాబితా ఎక్కడ ?
- ఒక్కో విద్యార్థి నుండి 150/- ఎగ్జామ్ ఫీజు
- నగదు బహుమతులు, మెమెంటోలతోనే మమ.
- ఇతర స్కూల్స్/కాలేజీల్లో టాపర్స్‌ను లాగేసుకోవటమే టార్గెట్.
ఎట్టకేలకు శ్రీచైతన్య స్కోర్ స్కాలర్‌షిప్ (SCORE SCHOLARSHIP - 2025) టెస్ట్ ఫలితాలు వెలువడ్డాయి. శ్రీకాకుళం జిల్లా పలాసలోని శ్రీచైతన్య స్కూల్‌లో సుమారు 1000 మందికి పైగా సొంత విద్యార్థులతో (SCORE SCHOLARSHIP - 2025) వస్తుంది అని విద్యార్థులను మభ్యపెట్టి పరీక్ష నిర్వహించినట్లు తల్లిదండ్రుల నుండి ఆరోపణలు వినిపించాయి. శ్రీచైతన్య స్కూల్‌లో స్కోర్ స్కాలర్‌షిప్ పేరుతో శ్రీచైతన్య దందా అనే న్యూస్ వైరల్ కావటంతో తప్పు సరిద్దుకునేందుకు హడావిడిగా స్కోర్ స్కాలర్‌షిప్ ఫలితాలు విడుదల చేసింది. కానీ స్కాలర్‌షిప్ సాధించిన విద్యార్థుల వివరాలను మాత్రం బహిరంగపరచలేదు. దీంతో పరీక్ష వ్రాసిన లక్షలాది మంది విద్యార్థులకు నిరాశే మిగిలింది. సెప్టెంబర్ 28 మరియు అక్టోబర్ 12 వ తేదీన ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ( శ్రీచైతన్య స్కూల్స్/ కాలేజ్‌లలో నిర్వహించిన) (SCORE SCHOLARSHIP - 2025)కు ఎంతమంది విద్యార్థులు అర్హత సాధించారో శ్రీచైతన్య వెల్లడిరచలేదు. దేశవ్యాప్తంగా ఏ సంస్థ పరీక్ష నిర్వహించినా ఫలితాలలను బహిరంగంగా ప్రకటించి నిజాయితీని చాటుకోవటం సంప్రదాయం. కానీ శ్రీచైతన్య దేశవ్యాప్తంగా రూ. 350 కోట్ల విలువైన స్కాలర్‌షిప్ నిర్వహించింది, కానీ అర్హత సాధించిన విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో ఆయా అభ్యర్థులు మాత్రమే చూసుకునేలా గోప్యత పాటిస్తోంది. బాధ్యత గల విద్యాసంస్థగా ఫలితాలను బహిరంగంగాను మరియు మీడియాకు వెల్లడి చేయాల్సి ఉంది. కానీ ఎందుకు వెల్లడిరచటం లేదు అన్నది పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ప్రతి తరగతిలో కేవలం 50 లోపు ర్యాంకులు సాధించిన వారికి వివిధ స్థాయిల్లో నగదు బహుమతులు మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకుంది శ్రీచైతన్య. ఈ నగదు బహుమతుల విలువ కేవలం అతితక్కువ ఉండటం గమనార్హం. ప్రజాస్వామ్యం ఆన్‌లైన్ న్యూస్.. ఇన్ఫినిటీ లెర్న్ ప్రతినిధులను సంప్రదించగా, ఫలితాలు ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటు ఉంటాయి, ఆఫ్‌లైన్‌లో వ్రాసిన వారి వివరాలు ఆయా బ్రాంచీలలో మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు. మొత్తం ఫలితాలకు సంబంధించిన సమాచారం మా వద్ద లేదు అని తెలియజేశారు.
సోషల్ మీడియాలో భారీ ప్రచారం
స్కోర్ పరీక్ష రాయండి, స్కాలర్‌షిప్ పొందండి అని సోషల్ మీడియా వేదిక ద్వారా ఊదరకొట్టిన శ్రీచైతన్య, అనుకున్నట్టే రూ. 350 కోట్ల స్కాలర్‌షిప్ ఇవ్వకుండా తల్లిదండ్రులను నెత్తిన టోపి పెట్టింది. స్కోర్ పరీక్షకు రెండు నెలలు ముందు నుండే సోషల్ మీడియా వేదికగా భారీ ప్రచారానికి తెరలేపింది ఇన్ఫినిటి లెర్న్. పైకి స్కాలర్‌షిప్ టెస్ట్ మాత్రమే, కానీ దీని వెనుక పెద్ద తతంగమే నడిచింది. దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన విద్యార్థులను వెతికి వెతికి పట్టుకోవటమే ఈ స్కాలర్‌షిప్ ఎగ్జామ్ యొక్క ముఖ్య ఉద్ధేశ్యం. శ్రీచైతన్య విద్యాసంస్థల్లోని విద్యార్థులు కాకుండా ఇతర విద్యాసంస్థల్లోని ప్రతిభావంతులైన విద్యార్థుల వివరాలు సేకరించటమే శ్రీచైతన్య స్కోర్ స్కాలర్‌షిప్ టెస్ట్ టార్గెట్. ఆ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేసింది శ్రీచైతన్య. ఇప్పటికే ఈ స్కోర్ ఎగ్జామ్‌లో పాల్గొన్న విద్యార్థుల వివరాలను సేకరించిన శ్రీచైతన్య వచ్చే విద్యాసంవత్సరానికి కల్లా వారందరిలో శ్రీచైతన్య విద్యాసంస్థల్లోలోకి రప్పించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇతర విద్యాసంస్థల్లో చదువుతున్న వారికి ఉచిత విద్యను ఆఫర్ చేయటం దగ్గర నుండి భారీ నగదు ఆశచూపటం, ఇతర ప్రయోజనాలు కలిగించేలా ప్రలోభాలకు గురిచేయటం వంటి కార్యక్రమాలతో విద్యార్థులను శ్రీచైతన్య విద్యాసంస్థల్లో చేరేలా మభ్యపెట్టటమే ఈ స్కాలర్‌షిప్ వెనుక ఉన్న అసలు సిసలు ఉద్ధేశ్యం. శ్రీచైతన్యలో చదువుతూ స్కోర్ ఎగ్జామ్‌లో రాసిన వారికి ఎలాంటి ఫీజు రాయితీలు ఉండవు. ఎందుకంటే బాగా టాలెంటెడ్ విద్యార్థులు రాబోయే రోజల్లో నీట్, జెఈఈ అడ్వాన్స్‌డ్ లాంటి ఎగ్జామ్స్‌లో 10 లోపు ర్యాంకు సాధిస్తే సంస్థ తలరాతే మారిపోతుంది. ఒక్క ర్యాంకు సాధిస్తే చాలు వేలాది అడ్మిషన్లు వచ్చేస్తాయి. గత సంవత్సరం జెఇఇ మెయిన్, అడ్వాన్స్‌డ్, నీట్ వంటి ఎగ్జామ్స్‌లో శ్రీచైతన్య ఫలితాలు అంతంత మాత్రంగానే వచ్చాయి దీంతో కాలేజీ నుండి స్కూల్స్ నుండి 20% స్టూడెంట్స్ వేరే స్కూల్స్/కాలేజీలను వెతుక్కుంటున్నారు. 2025 విద్యాసంవత్సరంలో శ్రీచైతన్యలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివి ఇంటర్ సెకండ్ ఇయర్ కోసం వేరే కాలేజీల్లో చేరిన వారి సంఖ్య పెద్ద ఎత్తున ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. స్కోర్ స్కాలర్‌షిప్ ద్వారా సంపాదించిన సమాచారంతో వేరే స్కూల్స్, కాలేజీల్లో చదివే విద్యార్థులను ఎర వేసేందుకు సిద్ధం అవుతోంది శ్రీచైతన్య.
స్కాలర్‌షిప్ పొందిన విద్యార్థుల జాబితా ఎందుకు ప్రకటించటం లేదు ?
రూ.350 కోట్ల SCHOLARSHIP ఆర్భాటంగా ప్రకటించిన శ్రీచైతన్య ఇప్పుడు వారి వివరాలు ప్రకటించకపోవటం శోచనీయం. ఒకవేళ వేరే సంస్థలో చదువుతూ శ్రీచైతన్య స్కోర్ ఎగ్జామ్‌లో మంచి ఫలితం వచ్చినా ప్రయోజనం దక్కదు. ఎందుకంటే శ్రీచైతన్య సంస్థలో అడ్మిషన్ తీసుకున్న వారికే మాత్రమే ఆ ప్రయోజనం వర్తిస్తుంది. కావలంటే నిశితంగా గమనించండి రూ. 350 కోట్ల వద్ద స్టార్ మార్క్‌తో షరతులు వర్తిస్తాయి అని ఉంటుంది. ఆ షరతులు అన్నీ శ్రీచైతన్య సంస్థకు అనుకూలంగా ఉంటాయి. చివరికి మోసపోతున్నది విద్యార్థులే. ప్రతిభావంతులని గుర్తించటం, వారిని తమ సంస్థల్లో చేర్చుకోటం. ఎగ్జామ్ రాసే ప్రతి స్టూడెంట్ దగ్గర నుండి సరాసరిన 150/- వసూలు చేస్తున్నారు. గత సంవత్సరం 7 లక్షలకు పైగా విద్యార్థులు ఎగ్జామ్ వ్రాయగా, ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మంది విద్యార్థులు పరీక్ష వ్రాసిరాని ఓ అంచనా. ఈ లెక్కన సుమారు 12 కోట్ల రూపాయలు ఎగ్జామ్ ఫీజుల నుండి శ్రీచైతన్యకు లభిస్తోంది. ఎగ్జామ్ వ్రాసే వరకే శ్రీచైతన్య హడావిడి, ఆ తర్వాత 50 లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందించి చేతులు దులుపుకుంటుంది. బహుమతులు అంటే ఓకే మరి స్కాలర్‌షిప్ పొందిన విద్యార్థుల వివరాలు ఎక్కడ అనేది అంతా గోప్యం. ఇన్ఫినిటీ లెర్న్ వెబ్‌సైట్ వెతికినా ఎక్కడ సమాచారం లభించదు. ఒలింపియాడ్స్‌లో ఒకటి లేదా రెండు సెలక్షన్స్‌కే ఆర్భాటంగా ప్రకటించే శ్రీచైతన్య...రూ. 350 కోట్ల స్కాలర్‌షిప్ అందిస్తున్నప్పుడు స్కాలర్‌షిప్ గెలుచుకున్న విద్యార్థుల వివరాలు ఎందుకు ప్రకటించటం లేదు. ఎందుకు గోప్యత పాటిస్తోంది. రూ. 350 కోట్ల స్కాలర్‌షిప్ అనేది ఉత్తమాటేనా ? కనీసం రూ. 50 కోట్ల విలువైన స్కాలర్‌షిప్ పొందిన వారు ఉన్నారా ? అసలు శ్రీచైతన్య స్కాలర్‌షిప్ ఇస్తుందా ? అనే అనుమానాలు కలగక మానదు. గత 3 సంవత్సరాలుగా శ్రీచైతన్య నిర్వహించిన (SCORE SCHOLARSHIP) ఎగ్జామ్స్‌లో 1000 కోట్లు ఎంత మంది విద్యార్థులకు అందించిందో పూర్తి వివరాలతో కూడిన సమాచారం ప్రజలకు అందించే సాహసం శ్రీచైతన్య చేయగలదా ?
మరో కోణం ?
స్కోర్ స్కాలర్‌షిప్ ఎగ్జామ్ నిర్వహించేంది శ్రీచైతన్య విద్యాసంస్థలు అయినా దాని నిర్వహణా బాధ్యలు మాత్రం ఇన్ఫినిటీ లెర్న్ (ర్యాంకుగురు టెక్నాలజీస్ ప్రై.లి. కంపెనీ) కి అప్పగించింది శ్రీచైతన్య. ఇది కూడా శ్రీచైతన్య డైరెక్టర్స్ ఆధ్వర్యంలో నడిచే ఓ షెల్ కంపెనీనే. పైకి ఇది శ్రీచైతన్య నిర్వహించే ఎగ్జామ్‌లాగా ప్రకటనలు గుప్పించటం, ఈ ఎగ్జామ్స్ నిర్వహణ ద్వారా తనకు చెందిన ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలకు డబ్బుని మళ్ళించటం కోసం శ్రీచైతన్య విద్యాసంస్థ నిర్వాహకుల ఎత్తుగడ. దేశవ్యాప్తంగా ఉన్న శ్రీచైతన్య టెక్నో స్కూల్స్, జూనియర్ కాలేజీలు, అకాడమీలలోని వివిధ రాష్ట్రాల్లోని వివిధ సొసైటీల ద్వారా సొమ్మును ర్యాంక్‌గురు టెక్నాలజీస్ ప్రై.లి. కంపెనీలోకి మళ్ళీంచటం కోసమే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గత 4 లేదా 5 సంవత్సరాల నుండి ఇలాంటి ఎగ్జామ్ నిర్వహించటం ద్వారా పరీక్షల నిర్వహణ, సాంకేతిక సాయం పేరుతో ర్యాంకుగురు టెక్నాలజీస్ కంపెనీలోకి పెద్ద ఎత్తున నిధుల మళ్ళింపు ద్వారా ర్యాంక్‌గురు టెక్నాలజీస్ ప్రై.లి. రూ. 100 కోట్ల కంపెనీగా మలిచింది శ్రీచైతన్య యాజమాన్యం.

0 Comments