- విద్యాసంస్థలకు భారీ షాక్ ఇచ్చిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.
- కిచెన్‌లైసెన్స్ రద్దు !
- విద్యార్థుల పరిస్థితి ఏంటో ?
మాదాపూర్‌లోని శ్రీచైతన్య విద్యా సంస్థలకు సంబంధించిన సెంట్రల్ కిచెన్‌లో అడుగడుగునా నిర్లక్ష్యం, అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. దీనికి తోడు కాలం చెల్లిన ఆహారపదార్థాలను వండేస్తూ విద్యార్థులు ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. దీనిపై తెలంగాణ ఫుడ్ సేప్టీ అధికారులకు ఎన్నో సార్లు ఫిర్యాదుల వచ్చాయి. దీంతో శ్రీచైతన్యకు సంబంధించిన కిచెన్‌పై ఫుడ్ సేప్టీ అధికారులు దాడి చేశారు. వంటగదిని అపరిశుభ్రంగా నిర్వహించడంపై మాదాపూర్‌లోని శ్రీచైతన్య విద్యాసంస్థల యాజమాన్యంపై ఆహార భద్రతా విభాగం అధికారులు సీరియస్ అయ్యారు.మాదాపూర్‌లోని శ్రీచైతన్య విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్ లైసెన్స్‌ను ఆహార భద్రతా విభాగం అధికారులు రద్దు చేశారు. గత శుక్రవారం శ్రీచైతన్య కిచెన్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేల మందికి భోజనం తయారు చేస్తున్న వంటగదిలో పాడైపోయిన ఆహార పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. సుమారు 125 కిలోల గడువు తీరిన ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. బియ్యం, కూరగాయలు, పప్పుదినుసులను అపరిశుభ్ర వాతావరణంలో స్టోర్ చేస్తున్నట్టు గుర్తించారు. కిచెన్, స్టోర్ రూమ్‌లో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్నట్టు తేల్చారు. ఈ వంటగది నుంచే గ్రేటర్ హైదరాబాద్‌లోని చైతన్య కాలేజీల హాస్టళ్లకు ఆహారం సరఫరా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇక్కడ వండే భోజనాన్నే హాస్టళ్లలోని వేల మంది విద్యార్థులకు రోజూ అందజేస్తున్నట్లు నిర్ధారించారు. కిచెన్ మొత్తం అపరిశుభ్రంగా ఉండడంపై ఆహార భద్రతా విభాగం అధికారులు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కిచెన్‌ను సీజ్ చేయాలని, ఫుడ్ లైసెన్స్ రద్దు చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ మేరకు మాదాపూర్(ఖానామెట్)లోని చైతన్య విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్ లైసెన్స్ రద్దు చేస్తూ ఉన్నతాధికారులు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. వంటగదిలో ఆహార తయారీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. ఉత్తర్వులు ఉల్లంఘించి ఆహారం తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
0 Comments