Ticker

6/recent/ticker-posts

AP : వేసవి సెలవుల్లో తరగతులకు కార్పొరేట్లు సిద్ధం..ప్రభుత్వ చర్యలు శూన్యం !

వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించకూడదన్న ప్రభుత్వ ఆదేశాలను పలు కార్పొరేట్‌ జూనియర్‌ కాలేజీలు పెడచెవిన పెడుతున్నాయి. పదవ తరగతి పూర్తయిన విద్యార్థులే టార్గెట్‌గా జెఈఈ/ నీట్‌ కోచింగ్‌ పేరిట ప్రకటనలను హోరెత్తిస్తున్నాయి. ఫలితాలు వచ్చే వరకైనా కనీసం స్వేచ్ఛ లేకుండా కార్పొరేట్‌ కాలేజీలు విద్యార్థుల స్వేచ్ఛను హరిస్తున్నాయి. నీట్‌ కోచింగ్‌ పేరిట శ్రీచైతన్య ఏఫ్రిల్‌ 4 వ తేదీన క్లాసులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. గోసలైట్స్‌ అనే మరో కాలేజీ 4 వారాల ఉచిత విద్య పేరుతో సోషల్‌ మీడియా వేదికగా ప్రకటిస్తోంది. ఇంటర్‌ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం చదివే విద్యార్థులకు అయితే చెప్పే పని లేదు. క్లాసులు జరుగుతూనే ఉంటాయి. మా దగ్గర చదువు బాగుటుంది, మా కాలేజీలో చేరండి అంటూ విద్యార్థుల్ని మభ్యపెడుతున్నాయి. ఏ కాలేజీ అయినా 10 లోపు, 100 లోపు ర్యాంకుకు గ్యారెంటీ ఇస్తుందా ? చేరిన ప్రతి విద్యార్థికి 100 లోపు ర్యాంకు తెప్పించగలదా ? ఏ కార్పొరేట్‌ విద్యాసంస్థకైనా ఫలానా ర్యాంకు తెప్పించగలము అని హామీ ఇవ్వగలిగే దమ్ము ఉందా ?

హక్కులు తుంగలోకి తొక్కి..

కార్పొరేట్‌ కాలేజీలకు వేసవి సెలవులు లేవు’ అనేది తెలుగు రాష్ట్రాల్లో నానుడి ఉంది. బాలల హక్కుల గురించి, వారిపై పడుతున్న ఒత్తిడి గురించి ఆలోచించే వారు ఒక్కరంటే ఒక్కరు లేరంటే అతిశయోక్తి కాదు. కార్పొరేట్‌ కాలేజీలు వారి వ్యాపారం కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వారు చెప్పిందే వేదం అని కనీసం ఆలోచించలేని తల్లిదండ్రులు ఉన్నంత కాలం కార్పొరేట్‌ సంస్థల ఆటలు సాగుతూనే ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సెలవులు అనేది విద్యార్థులు మునుపటి నెలల్లో నేర్చుకున్న వాటిని రిఫ్రెష్‌ చేయడానికి కేటాయించబడిన సమయం, కానీ పిల్లలపై మళ్లీ విద్యావేత్తల భారం వేయకూడదు. ఇదిలా ఉండగా, వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించరాదని జూనియర్‌ కాలేజీలకు బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటుంది. కానీ ఏ అధికారి కార్పొరేట్‌ కాలేజీలపై చర్య తీసుకునేందుకు సాహసించటం లేదు. అందుకే కార్పొరేట్‌ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆయా ప్రభుత్వాలకు నడుపుతున్న పార్టీలకు ఫండ్స్‌ను అందిస్తూ అందిన కాడికి దండుకుంటున్నాయి.

Post a Comment

0 Comments