- విద్యను పూర్తిస్థాయి వ్యాపారంగా మార్చిన శ్రీచైతన్య !
- ప్రమోషన్స్ కోసం బ్రాండ్ అంబాసిడర్‌లను నియమించుకుంటోన్న శ్రీచైతన్య
- అడ్మిషన్లను ఆకర్షించటం కోసం సరికొత్త ఎత్తుగడ
- ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నియమించుకున్న బ్రాండ్ అంబాసిడర్‌లు సొసైటీలు, ట్రస్ట్‌లకు ఎలా ప్రచారం చేస్తారు ?
- అధికారంలో ఉన్న పార్టీలకు భారీ విరాళాలతో ప్రభుత్వ పెద్దలకు దగ్గరవుతున్న శ్రీచైతన్య యాజమాన్యం !
- ఆపై వ్యవస్థలను గుప్పిట పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న శ్రీచైతన్య.
భారతదేశంలో విద్యను వ్యాపారంగా మార్చి ఒక్క రూపాయి సంపాదించిన అది శిక్షార్కమైన నేరం. కానీ మన దేశంలో విద్యను పూర్తి స్థాయి వ్యాపారంగా మార్చుకున్నాయి శ్రీచైతన్య లాంటి కొన్ని విద్యాసంస్థలు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా యధేచ్చగా నిబంధనలకు తూట్లు పొడుస్తూ తమ కార్యకలాపాలను కొనసాగిస్తోంది శ్రీచైతన్య. ఏది చేసినా అడిగేవాడు అన్న చందంగా సొంత రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటున్నాయి. అదే కోవలో ఇప్పుడు మరో అడుగు ముందుకు శ్రీచైతన్య బ్రాండ్ అంబాసిడర్‌లను నియమించుకుంటోంది. అల్లు అర్జున్, రోహిత్ శర్మ...ఇప్పుడు హీరోయిన్ శ్రీలీల. అదీ కూడా మార్కెట్లో కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే సినిమా హీరో అల్లు అర్జున్ మరియు స్టార్ క్రికెటర్ అయిన రోహిత్ శర్మలను శ్రీచైతన్య తన బ్రాండ్ అంబాసిడర్‌లుగా నియమించుకోగా, ఇప్పుడు శ్రీలీల వంతు వచ్చింది. భారతదేశంలో విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్ సర్వీస్... విద్య అన్నది సేవ, వ్యాపారం కాదు అని నిర్వచించిన మహనీయుల సూచనల్ని పెడచెవిన పెడుతున్నారు. విద్యపై సంపాదించిన ప్రతి రూపాయి మళ్ళీ విద్య కోసమే కేటాయించాలన్న నిబంధనలు ఉన్నా, శ్రీచైతన్య కోట్లాది రూపాయలు తమ బ్రాండ్ అంబాసిడర్‌లకు ఎలా చెల్లిస్తోంది.
నిబంధనల ఉల్లంఘనే !
సొసైటీ/ట్రస్ట్‌లలోని నిబంధనల ప్రకారం డబ్బును డైరెక్టర్లు సొంతానికి కూడా వాడుకోకూడదు. అదే సమయంలో విద్య అనేది వ్యాపారం దృక్పథంతో కాకుండా సేవాభావంతో సొసైటీ/ ట్రస్ట్‌లను నడపాలి. కానీ సొసైటీలలోని సొమ్మును పబ్లిసిటీకి ఖర్చుచేయకూడదు. వ్యాపారధోరణికి దూరంగా ఉండాలి. కానీ శ్రీచైతన్య సొసైటీల చట్టంలోని ప్రతి నియమాన్ని అతిక్రమిస్తోంది. సొసైటీల నిబంధనలు ఉల్లంఘన కారణంగా శ్రీచైతన్య సొసైటీలను రద్దు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరో కోణం ఏమిటంటే ఇన్ఫినిటీ లెర్న్ ఆన్‌లైన్ యాప్ పేరు మీద బ్రాండ్ అంబాసిడర్‌లతో ఎండార్స్‌మెంట్‌లు చేసుకుంటోందని సమాచారం. అదే పేరు మీద సొమ్ము చెల్లిస్తోంది. ఇన్ఫినిటీ లెర్న్ (ర్యాంకుగురు టెక్నాలజీస్ ప్రై.లి) అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇన్ఫినిటీ లెర్న్ నియమించుకున్న బ్రాండ్ అంబాసిడర్లను సొసైటీలు, ట్రస్ట్‌లతో నడిచే శ్రీచైతన్య ఎలా వాడుకుంటుంది ? సొసైటీలు, ట్రస్ట్‌ల్లోని సొమ్మును ప్రై.లి. కంపెనీలోకి తరలించడానికి శ్రీచైతన్య పన్నిన పన్నాగం ఇది. రాష్ట్రానికో సొసైటీ పేరుతో నడుస్తున్న శ్రీచైతన్య విద్యాసంస్థలు ట్రస్ట్‌లోని సొమ్మును ప్రైవేటు లిమిటెడ్ కంపెనీల్లోకి ఇప్పటికే వివిధ సేవల పేరుతో ధనాన్ని చేరవేస్తోంది. ఇది కచ్చితంగా నిబంధనల ఉల్లంఘనే. మరో వైపు ఇన్ఫినిటీ లెర్న్ ఆన్‌లైన్ యాప్ (ర్యాంకుగురు టెక్నాలజీస్ ప్రై.లి) పేరుతో ఒక సంస్థ, ఇన్ఫినిటీ లెర్న్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మరో సంస్థను సృష్టించి వీటి ద్వారా కోట్లాది రూపాయలు బ్రాండ్ అంబాసిడర్‌లకు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. విద్య ఏ రూపంలో ఉన్న సేవ క్రిందకే వస్తుంది. ఇక పోతే బ్రాండ్ అంబాసిడర్లకు చెల్లించే సొమ్ము ర్యాంక్‌గురు టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ కాగా ఇన్ఫినిటీలెర్న్ అనే డిజిటల్ లెర్నింగ్ యాప్‌కి మాత్రమే వాడుకోవాలి. కానీ సేవాభావంతో, లాభపేక్ష లేకుండా నడిపే శ్రీచైతన్య సంస్థ తన ఫలితాల ప్రమోషన్ కోసం అంబాసిడర్‌లను స్కూల్/ కాలేజీ అన్న తేడా లేకుండా వాడిపడేస్తుంది. ఇది మరో ఉల్లంఘన, ఒక తీవ్రమైన నేరం. ఒక వైపు సొసైటీల పేరుతో ఎలాంటి లాభాలు పొందటం లేదని ప్రభుత్వానికి చూపిస్తూ మరో వైపు కోట్లాది రూపాయలు బ్రాండ్ అంబాసిడర్‌లకు చెల్లించటం శ్రీచైతన్య పూర్తి వ్యాపారమయ దృక్పథానికి అద్దం పడుతోంది. ప్రజల్ని, వ్యవస్థల్ని తప్పుదోవ పట్టిస్తోంది శ్రీచైతన్య.
అధికార పార్టీలకు పార్టీ ఫండ్స్ ఇస్తున్న శ్రీచైతన్య !
ఇప్పటికే శ్రీచైతన్య షెల్ కంపెనీలైన శ్రీ చైతన్య స్టూడెంట్స్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ఏప్రిల్ 8, 2022న బీఆర్‌ఎస్ పార్టీకి రూ. 10 కోట్లు , వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. పేరు మీద బీఆర్‌ఎస్ పార్టీకి మరో రూ. 2 కోట్లు మొత్తం రూ. 12 కోట్లు బీఆర్‌ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పార్టీకి భారీ మొత్తంలో అందించినట్టు తెలుస్తోంది. ఇవే కాకుండా జనవరి 11, 2024న తెలుగుదేశం పార్టీకి 5 కోట్లు , జనవరి 11, 2024న జనసేన పార్టీకి రూ.1 కోటి చెల్లింపులు జరిపింది. కేవలం పార్టీ ఫండ్ కోసం కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసినట్లు ఈసీ రికార్డుల్లో తేలింది. ఇన్ని కోట్లు రూపాయలు పార్టీలకు ఫండ్స్ రూపంలో చేరవేసి శ్రీచైతన్య మీద ఎటువంటి ఆరోపణలు వచ్చినా పట్టించుకోకుండా ప్రభుత్వ మద్దతు ఉండేలా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆపై ఫీజులతో పాటు ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తూ కోట్లు దండుకుంటున్నారు. ఇంకో వైపు అకాడమీల పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా కాలేజీలు, రెసిడెన్షియల్స్ నడుపుతున్నారు. ఒక స్కూల్‌కి, కాలేజీకి అనుమతి తీసుకుని రెండు, మూడు స్కూల్స్‌ని నడుపుతున్నారు. అడిగేవాడు లేక ఇష్టారాజ్యంగా తయారైంది. విద్యను కార్పొరేట్ కంపెనీగా మార్చి పేద, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో లేకుండా దూరం చేసే కుట్ర చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం దృష్టిలో సేవ చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ శ్రీచైతన్యకు నష్టాలు చూపిస్తూ, టాక్స్‌లు ఎగవేతకు పాల్పడుతూ మరో వైపు బ్రాండ్ అంబాసిడర్‌లతో పాటు విపరీతంగా ప్రకటనలు ఇస్తూ అన్నీ వ్యసస్థలను మోసం చేస్తున్న తీరు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఇవన్నీ అందరికీ తెలిసినా ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోరు. అసలు నిబంధనలు ఉన్న సంగతి అధికారులు మరిచిపోయారు, నాయకులు విస్మరించారు. పోలీసులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. పత్రికలు ప్రకటనతో సరిపెట్టుకుంటున్నాయి. కానీ దేశానికి ముఖ్యమైన గుండెకాయ లాంటి న్యాయవ్యవస్థ కూడా సుమోటాగా కేసును నమోదు చేయటం లేదు బాధాకరం.
ర్యాంకులు కోసం శ్రీలీల గ్యారెంటీ ఇస్తున్నారా ?
శ్రీచైతన్యలో చేరితే ర్యాంకు గ్యారెంటీ అని శ్రీలీల ప్రకటనల ద్వారా అభయం ఇస్తున్నారా ? మరి ర్యాంకు రాని వారి పరిస్థితి ఏంటి ? అలాగే చదువుల ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్న విద్యార్థులకు కూడా బాధ్యత వహిస్తారా ? శ్రీలీల లాంటి ఫేమస్ సినీ హీరోయిన్ చెపితే అందరూ ఇట్టే నమ్మేస్తారు. అందుకే శ్రీచైతన్య శ్రీలీల వంటి ఫేమస్ హీరోయిన్‌ని ఎంచుకుంది. అలాంటప్పుడు ర్యాంకులు రాని వారందరూ శ్రీలీల చెప్పిందని శ్రీచైతన్యలో చేరా అని నిలదీస్తే...శ్రీలీల సమాధానం చెప్తుందా ? అందరికీ న్యాయం చేయలేని, సాధ్యం కాని హామీలు ప్రకటనల ద్వారా ఇవ్వటం నేరం, బాధ్యతారాహిత్యం. ఇప్పటికే పతంజలి యాజమాన్యం సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురైంది. నయంకాని వ్యాధుల విషయంలో ప్రకటనలు ఇవ్వకూడదని తెలియదా ? అని మొట్టికాయలు వేసింది. అదే రీతిలో శ్రీచైతన్య ఎప్పుడూ మొదటి 10 లోపు, 100 లోపు ర్యాంకులే ప్రకటనల్లో చెప్తుంది, చూపుతుంది. ర్యాంకులు రాని వాళ్ళందరూ ఒక్కసారిగా కేసులు పెడితే పరిస్థితి ఏమిటి? శ్రీచైతన్య బాధ్యత తీసుకుంటుందా ? ఒక్క 2023 నీట్‌లో దాదాపు 54000 మందికి పైగా పరీక్ష వ్రాస్తే సీటు సాధించే ర్యాంకులు వచ్చింది 8973 మంది. మిగిలిన 33000 పైగా విద్యార్థుల భవిష్యత్తు ఏంటి అంటే... సమాధానం చెప్పలేని స్థితిలో శ్రీచైతన్య ఉంది. మళ్ళీ లాంగ్‌టర్మ్ చదవండి, ర్యాంకు సాధించండి అంటుంది. శ్రీచైతన్య అంత గొప్ప సంస్థ అయితే చదివిన విద్యార్థులందరికీ 100 లోపు ర్యాంకు ఎందుకు రావటం లేదు అనే విషయం ఎప్పుడైనా ఆలోచించారా ? పిల్లాడి ప్రతిభను బట్టి ర్యాంకు వస్తుంది అనేది అందరికీ తెలుసు. ఇప్పటికైనా భ్రమలు తొలగించుకోండి. శ్రీచైతన్యలో చదివిస్తే ర్యాంకులు రావని గుర్తించండి. ర్యాంకులు రాని వాళ్ళు వేలల్లో ఉంటారని శ్రీలీలకి తెలియక ప్రకటనల్లో నటిస్తోంది. అసలు నిజం తెలిస్తే..ఏమంటుందో.
0 Comments