Ticker

6/recent/ticker-posts

VIZAG : రియల్ ఎస్టేట్ ముసుగులో మల్టీ లెవల్ మార్కెటింగ్: SSC DEVELOPERS అసలు రంగు చూస్తే షాక్ అవ్వాల్సిందే !

స్థిరాస్తి రంగాన్ని అడ్డుపెట్టుకుని తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆశజూపే సంస్థల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణే SSC Developers (www.sscdevelopers.in) పేరుతో నడుస్తున్న ఇన్వెస్ట్‌మెంట్ నెట్‌వర్క్.  పైకి ఇల్లు, ప్లాట్లు అమ్మే రియల్ ఎస్టేట్ సంస్థగా ప్రచారం చేసుకుంటున్న ఈ కంపెనీ, లోపల మాత్రం మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM) / చైన్ స్కీమ్ ఆధారంగా నడుస్తోందని మా పరిశోధనలో వెల్లడైంది.

రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు... పక్కా ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ ! 

సాధారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్లాట్లు లేదా ఇళ్లను అమ్మకాలు, కొనుగోలు చేస్తారు. కానీ SSC Developers డాక్యుమెంట్‌లో నిర్ణీత డిపాజిట్ ప్యాకేజీలు ఉన్నాయి. బేసిక్ ప్యాకేజీ: రూ.10,000, అడ్వాన్స్ ప్యాకేజీ: రూ.1,00,000  ప్రీమియం ప్యాకేజీ: రూ.10,00,000  దీనితో పాటు “గోల్డ్ కాయిన” ప్యాకేజీ పేరుతో కస్టమర్ల నుండి డబ్బులు సేకరిస్తున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీ ఇలా ఫిక్స్డ్ మనీ డిపాజిట్లను సేకరించటం పలు అనుమానాలకు తావిస్తోంది.  

నమ్మశక్యం కాని రిటర్న్స్ (ROI): 

వారానికోసారి చెల్లింపులు చేస్తూ 1% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ (ROI) ఇస్తామని, పెట్టుబడిని రెట్టింపు (2X) చేస్తామని కంపెనీ హామీ ఇస్తోంది. అంతేకాకుండా, ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే 200 రోజుల పాటు రోజుకు 0.5% ROI వస్తుందని చెబుతోంది. బ్యాంకు వడ్డీ రేట్లు ఏడాదికి 6% నుండి 7% ఉంటే, ఈ కంపెనీ ఏడాదికి వందల శాతంలో రిటర్న్స్ ఎలా ఇస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇది కచ్చితంగా పొంజీ స్కీమ్‌ల (Ponzi Scheme) లక్షణాలను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.  

15 స్థాయిల పిరమిడ్ నెట్‌వర్క్ 

ఈ కంపెనీ ముఖ్య ఉద్దేశం ప్లాట్లు అమ్మడం కంటే, ప్రజల ద్వారా ఒక నెట్‌వర్క్ సృష్టించి వారి ద్వారా మరొకరి చేత డబ్బులు పెట్టించడమే. కొత్త వారిని చేర్పిస్తే 5% డైరెక్ట్ కమిషన్ ఇస్తామని ఆశపెడతారు. ఆ తర్వాత ఏకంగా 15 లెవళ్ల వరకు కమిషన్లు చెల్లిస్తారు (లెవల్ 1 కి 10%, లెవల్ 2 కి 5% నుండి లెవల్ 15 వరకు). ప్రతీ లెవల్ ఆదాయం అన్‌లాక్ కావాలంటే తప్పనిసరిగా కొత్త రిక్రూట్‌మెంట్లు చేయాలనే నిబంధన స్పష్టంగా పేర్కొన్నారు. 

ఏజెంట్లకు ఎర 

కార్లు, బంగారం, అపార్ట్‌మెంట్ల పేరుతో నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించేందుకు ఏజెంట్లకు భారీ బహుమతులు ప్రకటిస్తున్నారు. రూ.10 లక్షల బిజినెస్ చేస్తే: రూ.30,000 లేదా వెండి, రూ.50 లక్షల బిజినెస్ చేస్తే: ఐఫోన్ లేదా రూ.1.20 లక్షలు, రూ.1 కోటి నుండి రూ. 3 కోట్ల బిజినెస్ చేస్తే కారు డౌన్ పేమెంట్ లేదా కారు, రూ.10 కోట్ల బిజినెస్ చేస్తే ఫ్లాట్/అపార్ట్‌మెంట్ లేదా రూ.30 లక్షలు నగదు అందించనున్నారు.

అనుకూలంగా నిబంధనలు 

ప్లాన్ మార్పులపై కంపెనీకి పూర్తి హక్కులు ఉన్నాయి” అని నిబంధన విధించారు. అంటే రేపు చెల్లింపులు ఆపేసినా లేదా తగ్గించినా బాధితులు ప్రశ్నించడం కష్టం. ప్రతి విత్‌డ్రాయల్‌పై 10% డిడక్షన్ పేరుతో కోత విధిస్తున్నారు. ప్రెజెంటేషన్ బ్రోచర్‌లో ఎక్కడా రెరా అనుమతి సంఖ్య, కంపెనీ CIN నంబర్, GST వంటి లీగల్ వివరాలు లేవు అదే విధంగా SEBI/RBI నిబంధనల ప్రస్తావన లేదు. వెబ్‌సైట్‌లో కనీసం అడ్రస్, ఫోన్ నంబర్ వంటి సమాచారం లేకపోవటం గమనార్హం. 

విశాఖ వాసులారా పారాహుషార్ 

బుడారి లక్ష్మణ్, పొట్నూర్ రమేష్, టీవీఆర్ మÖర్తి (మార్కెంటింగ్) అనే వ్యక్తులు ఎలాంటి రిజిస్టర్ కానీ కంపెనీకి అధినేతలుగా చలామణి అవుతున్నారు. వీరు వెబ్‌సైట్‌లో సుమారు 1500 ఎకరాల ల్యాండ్ బ్యాంక్, 150కి పైగా కన్‌స్ట్రక్షన్ సైట్స్ ఉన్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఇతరుల పేరు మీద ఉన్నవి తమవిగా చెప్పుకుంటూ కస్టమర్లను మభ్యపెడుతూ, పెట్టుబడుల పేరుతో నయవంచనలకు పాల్పడుతున్నారు. కేవలం 2 నెలల వ్యవధిలో దాదాపు 5 నుండి 6 కోట్ల రూపాయలు ప్రజల నుండి పెట్టుబడుల రూపంలో వసూలు చేయటం చూస్తే నెట్‌వర్క్ మార్కెటింగ్ పేరతో ఏ రేంజ్‌లో మోసం చేస్తున్నారో ఇట్టే అర్థం అవుతోంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి భూమిని కానీ అపార్ట్‌మెంట్స్‌ని కానీ కస్టమర్లకు రిజిస్ట్రేషన్ చేయకపోవటం విశేషం. వీరు చేసేది కేవలం మనీ సర్క్యులేషన్, వీరికి ఎలాంటి వ్యాపారాలు లేవు, ల్యాండ్ బ్యాంక్ అంతకన్నా లేదు. ఇప్పటికే దాదాపు 300 నుండి 400 మంది కస్టమర్లు వీరి వలలో చిక్కుకున్నారు. వీరంతా బాధితులుగా మారే అవకాశం లేకపోలేదు.

కష్టపడిన సొమ్మును పెట్టుబడిగా పెట్టేముందు

డిపాజిట్లు సేకరించి, అధిక వడ్డీలు/రిటర్న్లు ఇస్తామని చెప్పే ప్రతి మనీ సర్క్యులేషన్ లేదా స్కీమ్ RBI లేదా SEBI పరిధిలోకి వస్తుంది. సరైన అనుమతులు లేకుండా మల్టీ-లెవల్ విధానంలో డిపాజిట్లు సేకరిస్తే అది ‘ది ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (బ్యానింగ్) యాక్ట్, 1978’ కింద నేరం. కష్టపడి సంపాదించిన సొమ్మును పెట్టుబడిగా పెట్టేముందు సదరు కంపెనీల RERA రిజిస్ట్రేషన్, భూమి హక్కులు, ప్లానింగ్ పర్మిషన్లను జాగ్రత్తగా సరిచూసుకోవాలని పరిశోధనాత్మక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 

Post a Comment

0 Comments

Popular Posts

VIZAG :  రియల్ ఎస్టేట్ ముసుగులో మల్టీ లెవల్ మార్కెటింగ్: SSC DEVELOPERS అసలు రంగు చూస్తే షాక్ అవ్వాల్సిందే !
My Land Infra : బోర్డు తిప్పేసేందుకు సిద్ధమైన మైల్యాండ్ ఇన్‌ఫ్రా కంపెనీ!
 My Land Infra : రియల్ ఎస్టేట్ ముసుగులో ‘మై ల్యాండ్ ఇన్‌ఫ్రా’ మహా మోసం
 Genesis Capital : లక్ష పెట్టు...4 లక్షలు పట్టు....మరో ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్ !
ANKURA HOSPITALS : మదీనాగూడ బ్రాంచ్‌లో అసలు ఏం జరుగుతోంది ?
Ankura Hospitals : AS Rao Nagar LLP ఆర్ధిక లావాదేవీలపై సంచలన కథనం!
AVIGNA LABORATORIES : ఈ లెక్కల్లో పెద్ద లోసుగుంది ? భారీ పన్ను ఉల్లంఘనలు?
NEET 2024 ఫలితాలు ప్రకటించేసుకున్న శ్రీచైతన్య ! NTA ని అవమానిస్తున్న శ్రీచైతన్య !
 Vizag MP Family Kidnap : విశాఖలో రెచ్చిపోయిన కిడ్నాపర్లు ! ఉలిక్కిపడ్డ తెలుగు రాష్ట్రాలు !
Ankura Hospital ఉప్పల్ LLPలో భారీగా ఆర్థిక అక్రమాలు ?