గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అధికారుల చర్యతో శేరిలింగంపల్లిలోని శ్రీ చైతన్య పాఠశాల బ్రాంచ్ మూతకు గురైంది. భవన నిర్మాణంలో నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో.. ముఖ్యంగా సెల్లార్, తగినంత పార్కింగ్ స్థలం లేకపోవటం వల్ల పాఠశాలను సీజ్ చేశారు. ఈ పరిణామంతో సుమారు 1,400 మంది విద్యార్థులు ఇబ్బందికి గురైయ్యారు. సమస్యను అధిగమించడానికి పాఠశాల యాజమాన్యం తక్షణమే తరగతులను ఆన్‌లైన్ విధానంలోకి మార్చింది.
నిబంధనల ఉల్లంఘన !
పాఠశాలను సీల్ చేసిన కొద్ది రోజులకే అన్ని తరగతులకు సమ్మెటివ్ అసెస్‌మెంట్-1 (ూA-1) పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. విద్యా సంవత్సరం దెబ్బతినకుండా ఉండేందుకు.. తొమ్మిదో తరగతి విద్యార్థులకు పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. పదో తరగతి విద్యార్థులను చందానగర్‌లోని మరో బ్రాంచ్‌కు తరలించారు. దీనిపై స్పందించిన పాఠశాల నిర్వాహకులు అనేక నోటీసులు జారీ చేసినప్పటికీ సమయానికి వాటిని పాటించలేకపోవడం వల్లే భవనాన్ని సీజ్ చేశారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు మాట్లాడుతూ.. పాఠశాల నిబంధనల ఉల్లంఘనలు పదేపదే కొనసాగుతున్నాయని, అందుకే జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 461-A కింద చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఆమోదించిన ప్రణాళికల ప్రకారం తప్పనిసరిగా ఉండాల్సిన పార్కింగ్, సెల్లార్ సౌకర్యాలను కల్పించడంలో పాఠశాల యాజమాన్యం విఫలమైందని వారు పేర్కొన్నారు. ‘భవనంలో చాలా సంవత్సరాలుగా పాఠశాల నడుస్తున్నప్పటికీ, ఆమోదించిన నిబంధనలను తప్పక పాటించాలి. అమలును ఎప్పటికీ ఆలస్యం చేయలేం’ అని ఒక సీనియర్ అధికారి స్పష్టం చేశారు.
ఇప్పుడే ఎందుకు ?
పాఠశాలను సీజ్ చేసినప్పటి నుంచి ప్రతిరోజూ తల్లిదండ్రులు తాళం వేసిన ఆవరణ వద్ద గుమిగూడి యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు. ‘పాఠశాల ఇక్కడ దాదాపు తొమ్మిదేళ్లుగా పనిచేస్తోంది. విద్యా సంవత్సరం మధ్యలో ఎందుకు ఈ చర్య? కనీసం కొత్త భవనాన్ని ఏర్పాటు చేసే వరకు తరగతులను కంటిన్యూ చేయాలి’ అని ఒక ఏడో తరగతి విద్యార్థి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ తరగతులకు అలవాటు లేని చిన్న పిల్లలు ఈ పరిణామం మానసిక ఒత్తిడికి గురి అవుతారని చాలా మంది తల్లిదండ్రులు భయపడుతున్నారు.
వీలైనంత త్వరగా ఓపెన్ చేస్తాం !
పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. సమస్యను పరిష్కరించడానికి అధికారులతో చర్చలు జరుగుతున్నాయని, వీలైనంత త్వరగా పాఠశాలను తిరిగి తెరవాలని ఆశిస్తున్నామని తెలిపారు. అయితే కచ్చితమైన తేదీని మాత్రం చెప్పలేమని అన్నారు. జీహెచ్‌ఎంసీ సమాచారం ప్రకారం.. పాఠశాల యాజమాన్యం నిబంధనలు పాటించి భవనాన్ని క్రమబద్ధీకరించే వరకు లేదా నియమాలకు అనుగుణంగా ఉన్న మరొక భవనానికి మారే వరకు సీలింగ్ కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆన్‌లైన్ క్లాసెస్ కొనసాగుతున్నాయి.
0 Comments