Ticker

6/recent/ticker-posts

Srichaitanya : ‘శ్రీచైతన్య’కు నో రూల్స్‌? ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వినతి !

ఉమ్మడి రంగారెడ్డి మరియు హైదరాబాద్‌ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా 16 శ్రీచైతన్య కాలేజీల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. వీటిలో కొన్ని హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లోని డీడీ కాలనీ, చే నంబర్‌, తార్నాక, మారెడ్‌పల్లిలో ఉన్నాయి. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ, చందునాయక్‌ తండా, కావూరి హిల్స్‌, ఎల్బీనగర్‌ లోని ఆర్వీ హౌజ్‌, ఆదిబట్ల, ఆర్కేపురం ప్రాంతాల్లోనూ బ్రాంచులు ఉన్నాయి.

నోటీసులతో సరి..

యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా.. వాటిపై ఇంటర్‌ బోర్డు అధికారులు నిఘా పెట్టడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. మాదాపూర్‌లోని శ్రీచైతన్య కళాశాలపై ఆధారాలతో సహా అనేక ఫిర్యాదులు అందినా.. బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదని టాక్‌. యాజమాన్యంతో బోర్డు ఆఫీసర్లు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తే భయభ్రాంతులకు గురి చేశారనే విమర్శలు సైతం ఉన్నాయి. అనుమతులు లేకుండా అదనపు తరగతులు నిర్వహిస్తే రూ.10 లక్షల చొప్పున జరిమానా వేసి వాటిని సీజ్‌ చేయాలి. కానీ బోర్డు అధికారులు వాటిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. కేవలం కాలేజీలను అంతర్గతంగా పరిశీలించి నోటీసులతోనే సరిపెట్టడం గమనార్హం. జరిమానా వేయకపోవడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆఫీసర్లు లంచాలు తీసుకుంటూ వాటిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.

గత ప్రభుత్వంలో పెద్దల సహకారం?

ఇలా నిబంధనలు పాటించని కార్పొరేట్‌ కళాశాలలకు గత ప్రభుత్వంలో పెద్దల సహకారముందనే ప్రచారం జరుగుతున్నది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ హయాంలో.. నాటి ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధుల సహకారంతోనే శ్రీ చైతన్య యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాదనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. దీంతో కార్పొరేట్‌ విద్యాసంస్థలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ వినిపిస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కళాశాలపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామని, ప్రభుత్వం స్పందించి, పూర్తిస్థాయిలో విచారణ జరిపించి.. జరిమానా విధించాలని, ఆ కళాశాలలను సీజ్‌ చేయాలని కైస్త్రవ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు మాసారం ప్రేమ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.

Post a Comment

0 Comments