
భూములు మింగుతున్నరు
వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ మీద పోటీ చేస్తానని గద్దర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కాలేదు, పుచ్చిపోయిన తెలంగాణను చేశారంటూ విమర్శించారు. కేసీఆర్ విధానాలు తప్పు. ధరణి పేరుతో భూములు మింగాడు. పదేళ్ల తెలంగాణలో ప్రజలు కోరుకున్న పరిపాలన అందలేదు, దొరల పరిపాలన జరుగుతోందని అన్నారు. 77 ఏళ్ల వయసులో దోపిడీ పార్టీ పోవాలని ప్రజా పార్టీ పెట్టానని గద్దర్ చెప్పారు.భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఓట్ల యుద్ధానికి సిద్ధంకావాలి. ఓటును బ్లాక్ మనీ నుంచి బయటకు తేవాలి. ఇప్పటి వరకు అజ్ఞాతవాసం నుంచి ప్రజలను చైతన్యం చేశా. ఇక నుంచి పార్లమెంటరీ పంథాను నమ్ముకుని బయలుదేరానని గద్దర్ చెప్పారు. ఇది శాంతి యుద్ధం.. ఓట్ల యుద్ధం. పార్టీ నిర్మాణంకోసం గ్రామ గ్రామానికి వెళ్తా. సచ్చే ముందు సత్యమే చెపుతున్నా. నేను భావ విప్లవకారుడిని, అయిదేళ్ళ అడవిలో ఉన్నా అంటూ గద్దర్ అన్నారు. దోపిడోళ్ల పార్టీ పోయేందుకు ప్రజా పార్టీతో ముందుకొస్తున్నానని గద్దర్ ఈ సందర్భంగా స్పష్టంచేశారు.
జీవించే హక్కుతో పాటు ఐదు అంశాలతో...
వేల మంది అమరుల కారణంగా తెలంగాణ వచ్చింది. దొరల రాజ్యం వద్దని తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ సాధించి పదేళ్ల ఉత్సవాలు జరుగుతున్నాయి. తెలంగాణలో ప్రజా పాలన సాగడం లేదని గద్దర్ అన్నారు. కనీసం జీవించే హక్కుకూడా తెలంగాణ ప్రజలకు లేకుండా పోయిందంటూ గద్దర్ కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దొరల పాలన పోయి ప్రజాపాలన కోసం ప్రజా పార్టీని స్థాపిస్తున్నానని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం పాలన సాగాలి. జీవించే హక్కు సహా ఐదు అంశాలు ఆధారంగా పార్టీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.ప్రజా తెలంగాణ కోసం ప్రజల దగ్గరికి వెళుతున్నాను. ప్రతి గ్రామ గ్రామానికి వెళ్తాను. పార్టీ నిర్మాణం చేస్తాను. పార్టీ జెండా, ఎజెండా.. ప్రజల జెండా ఎజెండానే. ప్రలోభాల నుండి ఓటుని రక్షించడమే నా లక్ష్యం. భావసారూప్యత కలిగిన వ్యక్తులతో కలిసి ఒక విధానం, పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తా. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తా. నా పార్టీ ఎవరితో కలిసి వెళ్లాలి, ఎలా వెళ్లాలి అనేది ప్రజలే నిర్ణయిస్తారు. నా వెనుక కోట్ల మంది ప్రజలు ఉన్నారు వాళ్లే నా బలం, నా శక్తి అని గద్దర్ అన్నారు.
0 Comments