Ticker

6/recent/ticker-posts

Viindhya Gold : అధిక వడ్డీ వల విసురుతూ అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తున్న వింధ్య గోల్డ్ !

అధిక వడ్డీ పేరుతో గత కొంతకాలంగా కస్టమర్ల నుండి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరిస్తూ బోర్డ్ తిప్పేయటం పరిపాటిగా మారింది. గత దశాబ్దకాలంగా అగ్రి గోల్డ్, అభయ గోల్డ్, అక్షయ గోల్డ్ మాదిరిగానే...అధిక వడ్డీని (రూ. 3.69పైసలు)ఎరగా వేసి కోట్లాది రూపాయలు డిపాజిట్లుగా సేకరిస్తోంది వింధ్య గోల్డ్. ప్రతి లక్ష రూపాయల డిపాజిట్‌కి రూ. 3690/- ప్రతి నెలా,నెలా...60 నెలల పాటు వేస్తామంటూ నమ్మిస్తోంది. అలాగే కట్టిన మొత్తంలో ప్రతి 6 నెలలకి ఒకసారి అసలులో 10% తిరిగి అందిస్తామని మభ్యపెడుతోంది. ఒక లక్ష నుండి 17 లక్షల వరకు పెట్టుబడిగా పెట్టిన వారికి ఒక లాగా, 18 నుండి 50 లక్షల వరకు మరోలాగా, 50 లక్షల పైన డిపాజిట్ చేసిన వారికి మరో లాగా మభ్యపెడుతోంది. ఇదే కాకుండా కస్టమర్లపై ఆశల వల విసిరి వారికి తీసుకొచ్చిన ఏజెంట్లకు రూ. 1 లక్షకు 6% చొప్పున కమీషన్ ఇస్తోంది. 

ఇటీవల బయటపడిన కొన్ని కీలక పత్రాల ఆధారంగా, హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఒక ప్రముఖ బులియన్ గ్రూప్ వ్యాపార రుణాల పేరిట చట్టవిరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తూ, ప్రజలను మోసం చేసే భారీ కుంభకోణానికి తెరలేపినట్లు బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దాదాపు రూ. 180 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. దీని కోసం ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించి వారికి ప్రతి లక్ష రూపాయలకు రూ. 6000/` కమీషన్ ఆశచూపుతోంది. మరో ముఖ్యవిషయం ఏమిటంటే గోల్డ్ ప్రాసెస్ యÖనిట్‌లో రోజువారీ కార్యకలాపాలు సరిగ్గా సాగటం లేదు. ఇప్పటికే కంపెనీ గత 4 సంవత్సరాలుగా నష్టాలనే ప్రకటిస్తోంది. అదే సందర్భంలో టర్నోవర్ 2 కోట్లకు దిగజారింది. ఈ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తే, వింధ్యా బులియన్ (viindhya bullion) ప్రొప్రైటర్ చల్లా అంజన్ ప్రసాద్ సంతకాలు చేసిన వేర్వేరు ‘లెండింగ్ అగ్రిమెంట్లు’ తీవ్రమైన చట్టపరమైన ఉల్లంఘనలను, మోసపూరిత అంశాలను బయటపెట్టాయి. ఈ స్కామ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి

నమ్మశక్యం కాని లాభాల ఆశ (నెలకు 3.69% వడ్డీ)

ఈ ఒప్పంద పత్రాల ప్రకారం, పెట్టుబడిదారులకు నెలకు 3.69% వడ్డీ ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. నెలకు 3.69% అంటే సంవత్సరానికి 44.28% సాధారణ వడ్డీ అవుతుంది. ఒకవేళ చక్రవడ్డీ లెక్కిస్తే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో ఏ చట్టబద్ధమైన బంగారం వ్యాపారమో, రిఫైనరీనో లేదా కాయిన్ మింటింగ్ పరిశ్రమో నిరంతరాయంగా 5 సంవత్సరాల (60 నెలలు) పాటు 44% వార్షిక లాభాలను ఇవ్వడం అసాధ్యం. దేశంలో బ్యాంకులు లేదా సురక్షిత కార్పొరేట్ బాండ్లు కేవలం 7% నుండి 12% వడ్డీ మాత్రమే ఇస్తుండగా, ఇంత భారీ స్థాయిలో లాభాలు ఆశ చూపడం కేవలం కొత్త డిపాజిటర్ల డబ్బుతో పాత వారికి చెల్లింపులు చేసే “పొంజీ స్కామ” (Ponzi Scheme) లక్షణమే.

రుణ ఒప్పందం” అని అగ్రిమెంట్ కానీ నిజంగా ఇది డిపాజిట్ వసూలు

ఒప్పందాన్ని లెండింగ్ అగ్రిమెంట్ అని పిలవడం ద్వారా డిపాజిట్ నియంత్రణ చట్టాల పరిధిలోకి రాకుండా తప్పించుకోవాలని వింధ్య గోల్డ్ యాజమాన్యం చూస్తోంది. కానీ ఏ పేరు పెట్టినా చివరకు ప్రజల నుండి డబ్బు తీసుకొని వడ్డీ ఇవ్వడం అంటే అది డిపాజిట్ వ్యాపారమే, దానికి RBI లైసెన్స్ తప్పనిసరి.

భారీగా నగదు లావాదేవీలు (మనీ లాండరింగ్ అనుమానాలు)

పెట్టుబడుల సేకరణలో చట్టపరమైన బ్యాంకింగ్ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారు. రామవత్ పద్మ అగ్రిమెంట్: ఈమెకు సంబంధించిన రూ. 2,00,000 పెట్టుబడిలో.. ఏకంగా రూ. 1,80,000 నగదు (CASH) రూపంలో తీసుకోగా, కేవలం రూ. 20,000 మాత్రమే యూపీఐ (UPI) ద్వారా తీసుకున్నారు. వై సుధాకర్ అగ్రిమెంట్: ఈయనకు సంబంధించిన రూ. 3,00,000 లో.. రూ. 50,000 నగదుగా తీసుకోగా, మిగిలిన మొత్తాన్ని ఐదు వేర్వేరు మొబైల్ నంబర్ల నుండి ముక్కలు ముక్కలుగా యూపీఐ ద్వారా బదిలీ చేయించుకున్నారు.

ఐటీ చట్టం ఉల్లంఘన: ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 269SS ప్రకారం. రూ. 20,000 కంటే ఎక్కువ మొత్తాన్ని రుణం లేదా డిపాజిట్ రూపంలో నగదుగా స్వీకరించడం నిషిద్ధం. ఇలా చేస్తే సదరు మొత్తానికి 100% పెనాల్టీ పడుతుంది. ఇంత పెద్ద ఎత్తున అన్-అకౌంటెడ్ నగదును స్వీకరించడం బ్లాక్ మనీ లేదా మనీ లాండరింగ్ వ్యవహారంగా అనుమానించాల్సి వస్తోంది.

వన్-సైడెడ్ క్యాన్సిలేషన్ పాలసీ (పెట్టుబడిదారులకు ఉచ్చు)

ఒప్పందంలోని క్లాజ్ 8(A) ప్రకారం, ఒకవేళ పెట్టుబడిదారుడు అత్యవసరం ఉండి అగ్రిమెంట్‌ను రద్దు చేసుకుని తన డబ్బు వెనక్కి అడిగితే.. అసలు మొత్తంలో 40% క్యాన్సిలేషన్ ఛార్జీల పేరిట కంపెనీ జప్తు చేసుకుంటుంది. అదే క్లాజ్ 8(B) ప్రకారం, ఒకవేళ మొదటి పార్టీ (వింధ్యా బులియన్) గనుక అగ్రిమెంట్‌ను క్లోజ్ చేయాలనుకుంటే, కేవలం ఒక వాట్సాప్ మెసేజ్ లేదా కాల్ ద్వారా 30 రోజుల ముందస్తు నోటీసు ఇచ్చి ఎటువంటి పెనాల్టీ లేకుండా డబ్బులు వెనక్కి ఇచ్చేయవచ్చు. ఇది పూర్తిగా పెట్టుబడిదారులను నిలువునా ముంచేలా రాసుకున్న ఏకపక్ష నిబంధన.

సెక్యూరిటీ చెక్కుల పేరిట భ్రమలు.. బెదిరింపులు

పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించడానికి ఐసీఐసీఐ బ్యాంక్ కరెంట్ అకౌంట్ (A/c No - 386705001250) కి సంబంధించిన “సెక్యూరిటీ చెక్కులు” ఇచ్చారు. అయితే, స్కామ్ బయటపడి సైబర్ క్రైమ్ పోలీసులు సదరు బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసినా, లేదా అకౌంట్ లో డబ్బులు లేకపోయినా ఈ చెక్కులు చెల్లకుండా పోతాయి. పైగా, అగ్రిమెంట్ ముగిశాక ఒరిజినల్ పత్రాలు, చెక్కులు తిరిగి ఇవ్వకపోతే బాధితులపైనే తక్షణ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని క్లాజ్ 11 ద్వారా ముందే భయపెట్టే ప్రయత్నం చేశారు.

సమాచార గోప్యత 

ఒప్పందంలోని క్లాజ్ 5 ప్రకారం, పెట్టుబడిదారుడి కుటుంబ సభ్యులకు కానీ, స్నేహితులకు కానీ ఈ లావాదేవీల గురించి, చెల్లింపుల స్టేటస్ గురించి తెలుసుకునే హక్కు లేదు. ఈ నిబంధన ఎందుకు పెట్టారంటే.. బాధితులు ఎవరూ ఒకరినొకరు సంప్రదించకుండా, ఇదొక పెద్ద పూలింగ్ స్కామ్ అని ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా ఉంచడానికే.

హెచ్చరిక:

వింధ్యా బులియన్ ప్రొప్రైటర్ చల్లా అంజన్ ప్రసాద్ చేస్తున్న ఈ వ్యవహారం కేవలం సాధారణ వ్యాపార రుణాలు కావు. ఆర్‌బీఐ (RBI) లేదా సెబీ (SEBI) అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుండి భారీగా డిపాజిట్లు సేకరిస్తున్న కలెక్టివ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ లాగా ఇది కనిపిస్తోంది. గతంలో వచ్చిన అనేక గోల్డ్ మరియు పబ్లిక్ డిపాజిట్ స్కామ్‌ల తరహాలోనే ఈ 44% వడ్డీ ఆశ చూపే ముఠా కూడా ప్రజలను ముంచే ప్రమాదం ఉంది. ప్రజలు ఇటువంటి మోసపూరిత ఒప్పందాల పట్ల, ఆకర్షణీయమైన అబద్ధాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డిపాజిట్ల సేకరణచట్ట విరుద్ధం : RBI

ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడమే నిబంధనలకు విరుద్ధమని RBI చెఋతోంది. ఒక వేళ ప్రజల నుండి డిపాజిట్లు సేకరించాలనుకుంటే NBFC మరియు RBI లైసెన్స్ తప్పని సరిగా తీసుకోవాలి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయినా కూడా డిపాజిట్లు స్వీకరించడానికి వీలు లేదు. ఒక వేళ డిపాజిట్లు సేకరిస్తే, డిపాజిట్ చేసిన వారిని షేర్ హల్డర్లుగా చూపించాలి. నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడులు లేదా డిపాజిట్లు పేరుతో అనుమతులు లేకుండా సేకరించినట్లతే రూ. కోటి నుండి రూ. 25 కోట్లు పెనాల్టీ కట్టాలి. అలాగే పబ్లిక్ నుండి సేకరించిన మొత్తానికి రెండింతలు పెనాల్టీ కట్టాలి లేదా 5 ఏళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 (ఎస్)కి విరుద్ధంగా ప్రజల నుంచి అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయటం నిబంధనలకు విరుద్దం. ఇది సెక్షన్ 58 బీ (5ఏ) ప్రకారం అత్యంత శిక్షార్హమైన నేరమని స్పష్టం చేసింది. అగ్రిగోల్డ్, అభయ గోల్డ్...ఇప్పుడు అదే కోవలో వింధ్య గోల్డ్ ప్రజలకు కుచ్చు టోపీ పెట్టే దారిలో పయనిస్తున్నారు. 

వివరణలోనే దొరికిపోయిన యాజమాన్యం

ఇప్పటివరకు రూ. 180 కోట్లు వసూలు చేశామని, అందులో 80 శాతం.. అంటే దాదాపు రూ. 130 కోట్ల విలువైన భూమిని కస్టమర్లకు భద్రతగా ఇచ్చామని అంజన్ ప్రసాద్ పేర్కొన్నారు. అయితే ఆర్థిక నిపుణులు ఇక్కడే అసలు ప్రశ్న లేవనెత్తుతున్నారు. మీ దగ్గర రూ. 130 కోట్ల విలువైన క్లియర్ టైటిల్ ఆస్తులు ఉంటే, నేరుగా బ్యాంకులకు వెళ్తే తక్కువ వడ్డీకే వందల కోట్ల రుణం వస్తుంది కదా? అలా కాకుండా ఏజెంట్లకు భారీ కమీషన్లు ఇస్తూ, సామాన్య ప్రజల చుట్టూ తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? దీన్ని బట్టి చూస్తే అంత విలువైన ఆస్తి సంస్థ వద్ద లేదనేది పక్కాగా అర్థమవుతోంది.

 25% మే గ్యారెంటీ : రూ. 18 లక్షలు ఆపైన డిపాజిట్ చేసిన వారికి మాత్రమే 150 గజాల ప్లాట్ (మార్కెట్ విలువ కేవలం రూ. 4 లక్షలు) రిజిస్టర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే భారీగా డబ్బులు ఇచ్చిన వారికి కూడా కేవలం 25 శాతం మాత్రమే గ్యారెంటీ లభిస్తోంది. మరి రూ. 18 లక్షల లోపు డిపాజిట్ చేసిన మధ్యతరగతి, సామాన్య ఇన్వెస్టర్ల పరిస్థితి ఏమిటి? వారికి ఎలాంటి హామీ లేకపోవడమే నిబంధనల ఉల్లంఘనకు నిదర్శనం.

కచ్చితంగా మనీ సర్యులేషన్ ?:
“ఇలాంటి వార్తలు రాస్తే కస్టమర్లలో గందరగోళం ఏర్పడుతుందని, తద్వారా ఎవరికీ చెల్లింపులు చేయలేము” అని యాజమాన్యం అనడం బ్లాక్‌మెయిలింగ్‌లా ఉందే తప్ప బాధ్యతాయుతంగా లేదు. కొత్తగా వచ్చే డిపాజిట్ల డబ్బుతోనే పాతవారికి చెల్లింపులు జరిపే పక్కా ‘మనీ సర్క్యులేషన’ ఇక్కడ నడుస్తోందనడానికి ఈ వ్యాఖ్యలే ప్రత్యక్ష సాక్ష్యం.


సెబీ మరియు ఇతర సంస్థల పేరుతో తప్పుడు ప్రచారం: తమ సంస్థపై సెబీ మరియు ఇన్‌కంటాక్స్ వారిచే స్వయంగా ఆడిట్ చేయించుకున్నామని యాజమాన్యం చెబుతోంది. కానీ ఆర్‌బీఐ అనుమతి లేకుండా ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా ప్రజల నుండి డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదు అనే విషయం సెబీ మరియు ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్స్ చెప్పలేదా అనేది ప్రశ్న. అసలు ఇలా డిపాజిట్లు సేకరిస్తున్నాం ఇది తప్పా, ఒప్పా అని సెబీ, ఆర్.బి.ఐ., ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్స్ వారిక చెప్పి విచారణ అడిగారా లేదా అన్న విషయం చెప్పలేదు. సెబీ పరిధి వేరు, పబ్లిక్ డిపాజిట్ల పరిధి వేరు అనే కనీస చట్టపరమైన జ్ఞానం లేకుండా యాజమాన్యం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది.

పరువు నష్టం కేసులకు భయపడం - దర్యాప్తు ప్రతినిధుల స్పష్టీకరణ:

తమపై వార్తలు రాసిన మీడియా సంస్థలపై పరువు నష్టం కేసులు వేస్తామంటూ వింధ్య యాజమాన్యం చేస్తోన్న హెచ్చరికలను దర్యాప్తు ప్రతినిధులు కొట్టిపారేశారు. “మా దగ్గర డాక్యుమెంట్లు, కరపత్రాలు సాక్ష్యాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మీరు బేషుగ్గా పరువు నష్టం కేసు వేసుకోవచ్చు. చట్టం ముందు ఎవరైనా లొంగాల్సిందే. నిజంగా మీరు నిప్పు అయితే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) విచారణను స్వాగతించండి” అంటూ సవాల్ విసిరారు. వందల కోట్ల ప్రజాధనంతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల పోలీస్ శాఖ, ఆర్థిక దర్యాప్తు సంస్థలు తక్షణమే స్పందించి విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 



Post a Comment

0 Comments

Popular Posts

Target Babu : చంద్రబాబుపై సిఐడి రెండు పిటీషన్‌లు !
 varuntej and lavanya tripathi engagement : మెగా ఫ్యామిలీలో పెళ్ళి సందడి...వరుణ్‌తేజ్‌, లావణ్యల నిశ్చితార్థం !
మినీ జమిలీ ఎన్నికలకు కేంద్రం ప్లాన్‌ ! వర్కవుట్‌ అవుతుందా ?
ANKURA HOSPITALS : మదీనాగూడ బ్రాంచ్‌లో అసలు ఏం జరుగుతోంది ?
ALLEN AP : ఆంధ్రాలోనూ అలెన్‌ ముసుగు దందా !
Opposition Parties meeting in Bihar :  విపక్ష నేతల ఐక్యతా రాగం...ప్రధాని అభ్యర్థి ఎవరు ?
NC 23 : నాగ చైతన్య కెరీర్‌ లోనే హయ్యెస్ట్‌ బడ్జెట్‌తో  తండేల్‌
Resonance School : తల్లిదండ్రుల నమ్మకం కోల్పోయిన రెజొనెన్స్‌ !
Rahul Gandhi: ప్రధాని మోడీ “చెడు శకునం”
Fake Ayurvedic Doctor : పట్టీల నాగరాజు కాదు...దోపిడీ కాట్‌రాజ్ !