
మూడేళ్ళుగా నిర్వహణ, పట్టించుకోని విద్యాశాఖ అధికారులు..
ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టమొచ్చినట్లుగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా విద్యాసంస్థలను నెలకొల్పుతున్నారు. చుంచుపల్లి మండలంలోని నందా తండాలో అక్రమంగా మూడేళ్ల నుంచి శ్రీ చైతన్య పాఠశాల పేరుతో ఎటువంటి అనుమతులు లేకుండా పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటి దాకా చూసిచూడనట్టు వ్యవహరించిన విద్యాశాఖ అధికారులు విద్యాసంవత్సరం ప్రారంభమయ్యి 3 నెలల తర్వాత సీజ్ చేయటంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యంతో విద్యాశాఖ అధికారులకు ఇప్పటి దాకా నడిచిన చీకటి ఒప్పందాల కారణంగానే చూసి చూడనట్టు వదిలేసి, ఇప్పుడు ఒప్పదాలు బెడిసికొట్టేసరికి చర్యలు తీసుకున్నారని విద్యార్థి సంఘాల నాయకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా పర్మిషన్ లేని శ్రీచైతన్య సంస్థలపై చర్యలు తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు..
శ్రీచైతన్య స్కూల్‌లో చేరితే మీ పిల్లలకి ఐఐటీ కోర్సులు నేర్పిస్తామని, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తామని అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్లి మాయమాటలు చెప్పి ప్రైవేటు విద్యాసంస్థలు పాఠశాలలో చేర్పించుకుంటారు. ఎన్నో ఆశలతో తమ పిల్లలు వృద్ధిలోకి రావాలని, వేలకు వేలు ఫీజులు కట్టి తల్లిదండ్రులు పాఠశాలలో చేర్పిస్తారు. కానీ ఆ పాఠశాలకు పర్మిషన్లు ఉన్నాయా, అర్హత కలిగిన ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారా అని మాత్రం ముందుగానే చెక్ చేసుకోవడం లేదు. ఫలితంగానే శ్రీ చైతన్య లాంటి అక్రమ పాఠశాలలు పుట్టుకొస్తున్నాయి, తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయి. అర్ధాంతరంగా విద్యాశాఖ అధికారులు పాఠశాలను సీజ్ చేసే సరికి విద్యార్థుల తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. శ్రీ చైతన్య యాజమాన్యం ఇంత మోసం చేస్తారని ఊహించలేదని వాపోతున్నారు. విద్యాశాఖ అధికారుల అలసత్వం వల్లనే ఇటువంటి అక్రమ పాఠశాలలు పుట్టుకొస్తున్నాయని, తద్వారా విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
0 Comments