- టాలెంటెడ్ స్టూడెంట్స్ కోసం కార్పొరేట్ సంస్థల స్కాలర్‌షిప్ ట్రాప్ !
- పేరుకే రూ. 350 కోట్లు, ఇవ్వకుండా ఉండేందుకు సవాలక్ష షరతులు !
- ఎగ్జామ్ ఫీజుల రూపంలో కోట్ల సంపాదన !
- స్కాలర్‌షిప్ వస్తుందన్న ఆశలో తల్లిదండ్రులు ! ఒత్తిడికి చిత్తవుతున్న ‘విద్యార్థి’ !
స్కాలర్‌షిప్ ఎగ్జామ్ రాయండి, మా వద్ద ఉచితంగా చదువుకోండి...ఈ ఒక్క మాట ఇప్పుడు వేదంలా పనిచేస్తోంది. కార్పొరేట్ సంస్థలకు కాసులు కురిపిస్తోంది. కార్పొరేట్ మాయా ప్రపంచం విసిరిన ‘స్కాలర్‌షిప్ ’ అనే వలలో చిక్కి విద్యార్థులు విలవిలలాడుతున్నారు. టాలెంటెడ్ స్టూడెంట్స్‌ని ట్రాప్ చేయటం కోసం కార్పొరేట్ విద్యాసంస్థలు ఆడుతున్న ఆటే ఈ ‘ స్కాలర్‌షిప్ టెస్ట్‌లు అని తెలుసుకోలేకపోతున్నారు. డబ్బులు ఎవ్వరూ ఊరికే ఇవ్వరు...అని తెలిసినా ఎదో తెలియని ఆశ తల్లిదండ్రుల్ని ఊరిస్తుంది. ఈ కార్పొరేట్ కుతంత్రానికి చిక్కిన తల్లిదండ్రులు డబ్బులు కట్టి మరీ వారి పిల్లలనే ఒత్తిడి అనే హింసకు గురిచేస్తున్నారు. ఆ సంస్థలో వస్తుంది, ఈ సంస్థలో వస్తుంది అనే విద్యార్థికి ఒత్తిడి పెట్టి మరీ చదివించి ఆయా విద్యాసంస్థలకు డబ్బులు కట్టి పరీక్షలు రాయించి ఆర్థికంగా చితికిపోవటంతో పాటు మానసికంగా కుంగిపోతున్నారు. 100% వరకు స్కాలర్‌షిప్ అనేది ఒట్టి బూటకం అని చివరికి తెలుసుకుని ఊసురుమంటున్నారు. సవాలక్ష షరతులు, చెప్పలేనన్ని ని‘బంధనలు’ లతో తల్లిదండ్రులు విసిగిపోతున్నారు. చివరికి మోసపోయామని గుర్తించి నిట్టూర్చుతున్నారు. అసలు విద్యాసంవత్సరం ప్రారంభమై 2 నెలలు కాక ముందే స్కాలర్‌షిప్‌ల పేరుతో ఈ ప్రచారం ఏంటి ? ఈ కార్పొరేట్ సంస్థలు నిజంగానే స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నారా ? ఈ సంస్థలు చేస్తున్న మోసం ఏంటి ? సవివరాలతో కూడిన విశ్లేషణాత్మక కథనం ఇప్పుడు చూద్దాం.
రూ. 350 కోట్లు...250 కోట్లు...250 కోట్లు...250 కోట్లు...
ఏంటి...ఇన్ని కోట్లు అన్ని ఆశ్చర్యపోతున్నారా ! మన ఘతన వహించిన కార్పొరేట్ సంస్థలు టాలెంటెడ్ స్టూడెంట్స్ వెతికి పట్టుకోవడానికి ఎరగా చూపిన స్కాలర్‌షిప్ టెస్ట్‌ల మొత్తం విలువ. శ్రీచైతన్య ఏకంగా రూ. 350 కోట్లు ప్రకటించగా, ఆకాష్ విద్యాసంస్థ రూ. 250 కోట్లు ప్రకటించింది. అలాగే అలెన్ విద్యాసంస్థ అలెన్‌టెక్స్ పేరుతో రూ. 250 కోట్లు...ఇక మన ఫిజిక్స్ వాలా రూ. 250 కోట్లు ప్రకటించేశారు. ఫీజులో ఒక్క రూపాయి సైతం ముక్కుపిండి వసూలు చేసే కార్పొరేట్ విద్యాసంస్థలు కోట్లాది రూపాయలు స్కాలర్‌షిప్ రూపంలో ఇస్తాయంటే నమ్ముతున్నారా ? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఈ కార్పొరేట్ విద్యాసంస్థలు వారు వారు నిర్వహించే స్కాలర్‌షిప్ టెస్ట్‌లను అత్యంత కఠినంగా రూపొందిస్తారు. వాటిలో ప్రతిభ చూపిన అతికొద్ది మంది విద్యార్థులకు మాత్రమే బహుమతులు అందిస్తారు. అదీ కూడా భవిష్యత్తులో వారు మంచి ర్యాంకు సాధిస్తారు అనే నమ్మకం కలిగితేనే ఆయా విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందిస్తారు. గత 3 సంవత్సరాలుగా రూ. 1000 కోట్ల స్కాలర్‌షిప్ అంటూ ప్రకటించిన శ్రీచైతన్య...ఇచ్చిన స్కాలర్‌షిప్ నామమాత్రమే. గత 2 సంవత్సరాలుగా స్కాలర్‌షిప్ ఫలితాల రోజున స్కాలర్‌షిప్ పొందిన విద్యార్థులు వివరాలు అడిగితే ముఖం చాటేసింది. ఆన్‌లైన్‌లోనే లభ్యం అవుతాయని మాట దాటవేసింది శ్రీచైతన్య. 2025 కి వచ్చే సరికి కేవలం రూ. 350 కోట్లు ప్రకటించింది. ఇచ్చేది మాత్రం శూన్యం. శ్రీచైతన్యలో చదివే విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ పరీక్షకు అనర్హులు. ఇతర స్కూల్స్ విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్‌షిప్ నిర్వహించటం గమనించదగ్గ విషయం. మరో విషయం ఏమిటంటే ఒక స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులు మరో విద్యాసంస్థ నిర్వహించే స్కాలర్‌షిప్‌లో పాల్గొనకుండా వివిధ రకాల జిమిక్కులకు పాల్పడుతోంది. స్కాలర్‌షిప్ టెస్ట్‌లు నిర్వహించే తేదీలలో స్కూల్స్ నిర్వహించటం విశేషం.
షరతులు, నిబంధనలు ఎందుకు ?
రూ. 350కోట్లు, రూ. 250 కోట్లు స్కాలర్‌షిప్ ఇచ్చేందుకు సిద్ధమైన కార్పొరేట్ విద్యాసంస్థలు...ఎంత మందికి ఇస్తున్నారు ? ఒక్కొక్కరికి ఎంత ఇస్తున్నారు ? ఎలా ఇస్తున్నారు ? అనే వివరాలు ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు. రూ. 350 కోట్ల వద్ద ఒక్క స్టార్ మార్క్ పెట్టి షరతులు మరియు నిబంధనలు వర్తిస్తాయి అని షరతులు పెడుతున్నారు. ఆ షరతుల వివరాలు ఏంటి అనేది ఎక్కడా పొందపరచలేదు. అంటే శ్రీచైతన్యకు ఇచ్చే ఉద్ధేశ్యం లేదా ? స్కాలర్‌షిప్ ఇచ్చే ఉద్ధేశ్యం ఉన్నప్పుడు ఈ షరతులు, నిబంధనలు ఎందుకు ? ఉదాహరణకు 10 వ తరగతిలో ఆలిండియా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన వారికి 10 లక్షలు, 2 వ ర్యాంకు సాధించిన వారికి 5 లక్షలు అంటూ తరగతుల వారీగా ఏ ర్యాంకు సాధించిన వారికి ఎంతో ఇస్తుందో క్లియర్‌గా ప్రకటించలేదు. అదే సమయంలో శ్రీచైతన్య స్కోర్ 2024 ఫలితాల్లో ప్రతి తరగతిలో కేవలం 100 లోపు ర్యాంకులు సాధించిన వారికి మాత్రమే కేవలం నగదు బహుమతులు ప్రకటించింది. స్కాలర్‌షిప్ సాధించిన వారి వివరాలు బహిరంగంగా ప్రకటించలేదు. అసలు రూ. ఇన్ని కోట్ల రూపాయలు స్కాలర్‌షిప్‌లు ఎంత మందికి ఇచ్చారు ? ఎంతెంత ఇచ్చారు ? అనే విషయం వెబ్‌సైట్‌లో ప్రకటించి విశ్వసనీయత నిరూపించుకోవలసి ఉంది. కానీ కార్పొరేట్ విద్యాసంస్థలు ఇలా చేసిన పాపాన పోలేదు. ఇలాంటి బోగస్ స్కాలర్‌షిప్‌ల పట్ల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.కార్పొరేట్ విద్యాసంస్థలు సైతం స్కాలర్‌షిప్ ఎవరెవరికీ ఎంత ఇస్తుందో బహిరంగంగా ప్రకటించి విశ్వసనీయత చాటుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే అన్ని సంస్థలను మోసపూరిత సంస్థలుగా భావించవలసి ఉంటుంది. మరీ ఈ విద్యాసంస్థలన్నీ విశ్వసనీయత చాటుకుంటాయా ? లేక మోసపూరిత సంస్థలుగా మిగిలిపోతాయా అనేది కాలమే నిర్ణయిస్తుంది.
స్కాలర్‌షిప్ అంతా బోగస్ !
రూ.350 కోట్ల స్కాలర్‌షిప్ ఇవ్వటం అనేది ఉత్తమాట. ఉదాహరణకి ఒకవేళ వేరే సంస్థలో చదువుతూ శ్రీచైతన్య స్కోర్ ఎగ్జామ్‌లో మంచి ఫలితం వచ్చినా ప్రయోజనం దక్కదు. ఎందుకంటే శ్రీచైతన్య సంస్థలో అడ్మిషన్ తీసుకున్న వారికే మాత్రమే ఆ ప్రయోజనం వర్తిస్తుంది. అదీ కూడా ఒక సంవత్సరమే. కావలంటే నిశితంగా గమనించండి రూ. 350 కోట్ల వద్ద స్టార్ మార్క్‌తో షరతులు వర్తిస్తాయి అని ఉంటుంది. ఆ షరతులు అన్నీ శ్రీచైతన్య సంస్థకు అనుకూలంగా ఉంటాయి. మరికొన్ని సంస్థలైతే ఆయా ప్రోగ్రామ్స్ Ê హాస్టల్‌లో చేరిన వారికి మాత్రమే అని సూచిస్తున్నారు. చివరికి మోసపోతున్నది విద్యార్థులే. ప్రతిభావంతులని గుర్తించటం, వారిని తమ సంస్థల్లో చేర్చుకోటం శ్రీచైతన్యతో పాటు ఇతర కార్పొరేట్ సంస్థలు చేసే నిరంతర ప్రక్రియ. ఎగ్జామ్ రాసే ప్రతి స్టూడెంట్ దగ్గర నుండి సరాసరిన 150/` నుండి రూ. 300 /` వసూలు చేస్తున్నారు. శ్రీచైతన్య గత సంవత్సరం 8 లక్షలకు పైగా విద్యార్థులు ఎగ్జామ్‌వ్రాయగా, ఈ సంవత్సరం 9 నుండి 10 లక్షల మంది చేత ఎగ్జామ్ వ్రాయించాలనే లక్ష్యంగా పెట్టుకుంది శ్రీచైతన్య. ఈ లెక్కన సుమారు 10.5 కోట్ల రూపాయలు ఎగ్జామ్ ఫీజుల నుండి శ్రీచైతన్యకు లభిస్తోంది. వాటి నుండే నగదు బహుమతులు, మెమెంటోలు అందిస్తారు. ఎగ్జామ్ వ్రాసే వరకే శ్రీచైతన్య హడావిడి, ఆ తర్వాత బహుమతులు ఎంత మందికి ఎన్ని బహుమతులు ఇచ్చింది ఎక్కడ ప్రస్తావించిన పాపన పోలేదు. శ్రీచైతన్య స్కోర్ వెబ్‌సైట్ వెతికినా ఎక్కడ సమాచారం లభించదు. శ్రీచైతన్య విద్యాసంస్థల్లో చదివే కొందరు ప్రతిభావంతులైన విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్‌లు వంటి చిన్న చిన్న బహుమతులు ఇచ్చి చేతులు దులుపుకోవటం కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఏ విద్యాసంస్థ అయినా ఎవరైనా విద్యార్థి కోటి రూపాయల బహుమతి గెలుచుకున్నట్లు ఒక్క విద్యాసంస్థ అయినా ప్రకటించిందా ? లేదు. గత 3 సంవత్సరాలుగా శ్రీచైతన్య నిర్వహించిన స్కోర్ స్కాలర్‌షిప్ ఎగ్జామ్స్‌లో ఒక్కో సంవత్సరం 1000 కోట్లు చొప్పున ఎంత మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందించిందో పూర్తి వివరాలతో కూడిన సమాచారం ప్రజలకు అందించే సాహసం శ్రీచైతన్య చేయగలదా ?
అసలు రూ. 350 కోట్లు ఎక్కడివి ?
శ్రీచైతన్య స్కోర్ ద్వారా రూ. 350 కోట్ల స్కాలర్‌షిప్‌కు సంబంధించిన డబ్బు ఎక్కడవి ? శ్రీచైతన్య యాజమాన్యానివా ? సొసైటీలకు చెందినవా ? లేక ప్రై.లి. కంపెనీవా ? లేక నల్లధనాన్ని స్కాలర్‌షిప్‌ల రూపంలో విద్యార్థులకు ఇస్తున్నట్లు చూపిస్తూ వాటిని కార్పొరేట్ యాజమాన్యానికి చెందిన వివిధ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీల్లోకి మళ్ళించి వైట్‌గా మార్చుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు నిజంగా రూ. 350 కోట్లు శ్రీచైతన్య యాజమాన్యం ఎక్కడి నుండి తీసుకువస్తుందో లెక్కలు చెప్పాల్సి ఉంది.
0 Comments