శ్రీచైతన్య స్టూడెంట్స్ ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కేవలం రూ. 2,60,20,843/- చెల్లించలేని దీనస్థితిలో ఉందా ? కె. రామమోహన్‌రావు శ్రీచైతన్య స్టూడెంట్స్ ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్‌పై ఎందుకు దివాలా పరిష్కార దావాకు దిగారు ? శ్రీచైతన్య స్టూడెంట్స్ ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ ఎందుకు కాళ్ళ బేరానికి దిగి సెటిల్‌మెంట్ చేసుకుంది. వివాదాన్ని పరిష్కారం చేసుకుని కంపెనీపై దివాలా ముద్ర పడకుండా శ్రీచైతన్య స్టూడెంట్ ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ తనను తాను ఎలా కాపాడుకుంది ? అనే అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అద్దె చెల్లించకుండా వేధింపులు
విజయవాడ, గూడవల్లిలోని సర్వే నెంబరు : 183/ 212 లోని స్థలంలోని బిల్డింగ్‌కి అద్దె చెల్లించని కారణంగా ఆ బిల్డింగ్ యజమాని కె. రామ మోహన రావు ఏకంగా శ్రీచైతన్య యాజమాన్యంపై దివాలా పరిష్కార ప్రక్రియకు దిగారు. దీనికోసం ముంబాయిలోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను సంప్రదించారు. దీంతో దిగి వచ్చిన యాజమాన్యం ఇవ్వవలసిన అద్దె బకాయిలను చెల్లించి 11 జూలై 2023న సెటిల్‌మెంట్ చేసుకుంది. చట్టపరంగా దివాలా వేటును తప్పించుకుంది. కానీ ఎక్కడా శ్రీచైతన్య స్టూడెంట్స్ ఫెలిసిటీస్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. తన కంపెనీ ఆబ్జక్ట్‌లో చూపిన విధంగా హోటల్స్ కానీ, మోటెల్స్ కానీ ఎక్కడా నిర్వహించటం లేదు. శ్రీచైతన్య విద్యాసంస్థలకు సంబంధించిన హాస్టల్స్ నిర్వహణను శ్రీచైతన్య స్టూడెంట్స్ ఫెలిసిటీస్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. తన కార్యకలాపాలుగా చూపుతూ శ్రీచైతన్య విద్యాసంస్థల సొసైటీలలోని డబ్బును ఈ కంపెనీలోకి తరలిస్తోంది. శ్రీచైతన్య స్టూడెంట్స్ ఫెలిసిటీస్ మేనేజ్‌మెంట్ ప్రై.లి నుండి షేర్‌ల రూపంలో వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ కంపెనీకి తరలిస్తోంది. అన్నింటికన్నా ముఖ్యం గత 3 సంవత్సరాలుగా శ్రీచైతన్య స్టూడెంట్స్ ఫెలిసిటీస్ మేనేజ్‌మెంట్ ప్రై.లి తన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్‌తో పాటు పూర్తిస్థాయి బ్యాలెన్స్ షీట్‌ను మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఆఫైర్స్‌కు సమర్పించటం లేదు. రోజు వారీ కార్యకలాపాలు లేవు, శ్రీచైతన్య స్టూడెంట్స్ ఫెలిసిటీస్ మేనేజ్‌మెంట్ ప్రై.లి తన చిరునామాగా చూపిన ప్లాట్ నెం. 80, శ్రీ సాయి ప్లాజా, అయ్యప్ప సొసైటీ, మాదాపూర్‌లో వర్సిటీ కార్యకలాపాలే నడుస్తున్నాయి.
ఏ లాభాల్లో నుండి రాజకీయ పార్టీలకు విరాళం !
శ్రీచైతన్య స్టూడెంట్స్ ఫెలిసిటీస్ మేనేజ్‌మెంట్ ప్రై.లి ఒక వైపు రుణదాతలను ఇబ్బంది పెడుతూ ఉన్నా మరోవైపు అక్టోబర్ 23, 2020 వ తేదీన భారీ వర్షపాతం కారణంగా తెలంగాణ సిఎం రిలీఫ్ ఫండ్‌కి రూ. కోటి రూపాయల విరాళం అందించింది. అనంతరం ఏప్రిల్ 8, 2022న బీఆర్‌ఎస్ పార్టీకి రూ. 10 కోట్లు బీఆర్‌ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పార్టీకి విరాళాలు అందించింది. వీటితో పాటు జనవరి 11, 2024న తెలుగుదేశం పార్టీకి 5 కోట్లు , జనవరి 11, 2024న జనసేన పార్టీకి రూ.1 కోటి చెల్లింపులు జరిపింది. కేవలం పార్టీ ఫండ్ కోసం కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసినట్లు ఈసీ రికార్డుల్లో తేలింది. అద్దె చెల్లింపుల కోసం ఓనర్లను ఇబ్బందులకు గురి చేసే శ్రీచైతన్య యాజమాన్యం తన కంపెనీలపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చుతుంది. 02-06-2021 నాటికి 367,68,30,000 కోట్లు కంపెనీ రిజర్వ్ క్రింద చూపింది. ఆ రిజర్వ్‌లు ఎలా వచ్చాయి , ఏ వ్యాపారం మీద అంత లాభం వచ్చింది. అన్నింటినీ మించి రాజకీయ పార్టీలకు ఇన్ని కోట్లు విరాళాలుగా ఎలా ప్రకటిస్తోంది అని మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రభుత్వంలోని పెద్దల అండతో అధికారులపై వత్తిడి పెంచి శ్రీచైతన్య సంస్థల్లో జరిగే లోపాలు, అవకతవలపై నోరెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
0 Comments