Ticker

6/recent/ticker-posts

Highcourt : చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు



స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేస్తూ జస్టిస్‌ టి.మల్లికార్జున్‌రావు తీర్పు వెల్లడిరచారు. ఈ నెల 28న రాజమహేంద్రవరం జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. మధ్యంతర బెయిల్‌ మంజూరు సమయంలో విధించిన షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయని.. 29వ తేదీ నుంచి రాజకీయ ర్యాలీలు, సభల్లో చంద్రబాబు పాల్గొనవచ్చని న్యాయమూర్తి తెలిపారు. అయితే, ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరుకావాలని ఆదేశించారు. చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టులో అందించాలని ఆదేశాలు జారీ చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు గురువారం (ఈనెల 17న) ముగియడంతో తీర్పును ఉన్నత న్యాయస్థానం రిజర్వు చేసింది. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. తాజాగా సోమవారం బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది.

వాదనలు కొనసాగాయిలా..

రాజకీయ పెద్దలు చెప్పినట్లు ఏపీ సీఐడీ నడుచుకుంటోందని చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు గురువారం వాదనలు వినిపించారు. పోలీసులు చట్టానికి విధేయులై ఉండాలి తప్ప రాజకీయ నేతలకు కాదని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ దురుద్దేశపూర్వకంగా, రాజకీయ కక్షతో చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేశాయని, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. వాస్తవాలను దాచిపెట్టి అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. వృత్తి విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున బార్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయవచ్చు గానీ, తాము ఆ పని చేయట్లేదని తెలిపారు. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘లొంగిపోయేటప్పుడు రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్‌కు సీల్డ్‌కవర్లో వైద్యనివేదికలు అందజేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పిటిషనర్‌ ఉల్లంఘించారు. ఆ నివేదికలు నమ్మశక్యంగా లేవు. బెయిల్‌ మంజూరుకు వాటిని పరిగణనలోకి తీసుకోనక్కర్లేదు. ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించాలి. మధ్యంతర బెయిల్‌ పొందిన చంద్రబాబు.. హైదరాబాద్‌ వెళ్లి ర్యాలీ నిర్వహించి, కోర్టు షరతులను ఉల్లంఘించారు. బేగంపేట పోలీసులు ఆయనపై కేసు నమోదుచేశారు. ఈ కేసులో ఇతర నిందితులకు బెయిల్‌ మంజూరయిందన్న కారణంతో పిటిషనర్‌కు బెయిల్‌ ఇవ్వాలని న్యాయవాదులు కోరడం సరికాదు. అందువల్ల బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేయాలి’ అని కోరారు. ఇరుపక్షాల వాదనలు విని తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు.. తాజాగా బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది.

Post a Comment

0 Comments

Popular Posts

Sri chaitanya : శ్రీచైతన్య స్కూల్‌ సీజ్‌ !
sri chaitanya : తవ్వేకొద్ది బయటపడుతున్న శ్రీచైతన్య షెల్‌ కంపెనీల అక్రమాలు !
Scholarships : కార్పొరేట్‌ విద్యాసంస్థల కుతంత్రం ! బోగస్‌ స్కాలర్‌షిప్‌లతో విద్యార్థులపై దండయాత్ర !!
Sri Chaitanya Trust : ఇష్టారాజ్యంగా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌లు/ సొసైటీలు !
SRI CHAITANYA NEET 2025 : కూలిపోతున్న డాక్టర్‌ కలలు !
JEE ADVANCED 2025 : IIT ర్యాంకుల పేరుతో తల్లిదండ్రుల్ని బకరాల్ని చేస్తున్న శ్రీచైతన్య !
Sri Chaitanya Sisters : శ్రీచైతన్య షెల్‌ కంపెనీల గుట్టు రట్టు !
Suicides in Sri chaityana Hostels: కార్పొరేట్‌ హాస్టల్స్‌లో ఘోషిస్తున్న ఆత్మలు !
INFINITY META JR APP పేరుతో అడ్డంగా దండుకుంటున్న శ్రీచైతన్య !
INFINITY META APP : ఆన్‌లైన్‌ పేరుతో ఇన్ఫినిటీ దోపిడీ !