- రూ.కోటి దాటి డిపాజిట్ చేసినవారు వేలల్లో ఉన్నారు.
- జాతీయ బ్యాంకుల్లో కాకుండా తక్కువ వడ్డీ ఇచ్చే చిట్‌ఫండ్ కంపెనీలో డిపాజిట్లా?
- ఆర్బీఐ, ఐటీ, సీబీడీటీ కంట్లో పడకుండా నల్లబాబుల జాగ్రత్తలు
- ఆదాయపన్ను చట్టాన్ని పాటిస్తున్నట్లు మార్గదర్శి బుకాయింపు
- కానీ డిపాజిట్ల సేకరణకు అనుసరించాల్సింది ఆర్బీఐ నిబంధనలు
మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఈసారి అక్రమ డిపాజిట్లు వంతు అయ్యింది. అక్రమ డిపాజిట్ల గుట్టు తేల్చేందుకు సీఐడీ తీసుకుంటున్న చర్యలతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ యజమానులకు వెన్నులో వణుకు పుడుతోంది. రూ.కోటి దాటి అక్రమ డిపాజిట్లు చేసిన వారెవరు? వారి వెనుక ఉన్నదెవరు? అన్న అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సీఐడీ చర్యలను వ్యతిరేకించడం ద్వారా అక్రమ డిపాజిట్ల సేకరణను మార్గదర్శి పరోక్షంగా అంగీకరించినట్లైందని పరిశీలకులు పేర్కొన్నారు.
బ్యాంకులను కాదని చిట్‌ఫండ్ కంపెనీలో డిపాజిట్లా ?
రాష్ట్ర వ్యాప్తంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ 37 బ్రాంచి కార్యాలయాల పరిధిలో ఇప్పటికే వెయ్యి మందికిపైగా అక్రమ డిపాజిట్‌దారులను సీఐడీ అధికారులు గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటిదాకా 800 మందికిపైగా అక్రమ డిపాజిట్‌దారులకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. డిపాజిట్ చేసిన మొత్తం ఎలా ఆర్జించారు? ఆదాయ మార్గాలను వెల్లడిరచాలని నోటీసుల్లో పేర్కొంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నిబంధనలను పాటించారా? అనే వివరాలను వెల్లడిరచాలని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను ఆదేశించింది. అంత భారీ మొత్తాన్ని జాతీయ బ్యాంకులు, కేంద్ర ఆర్థిక సంస్థల్లో కాకుండా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో దాచడం సాధారణ అంశం కాదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జాతీయ బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలపై 5 శాతం కంటే అధికంగా వడ్డీ చెల్లిస్తున్నాయి. మార్గదర్శి కేవలం 5 శాతం వడ్డీనే చెల్లించడం, అదికూడా ఓ రశీదు జారీ చేసి సరిపుచ్చుతున్నా భారీగా డిపాజిట్లు చేయడం వెనుక పెద్ద మతలబే ఉన్నట్లు స్పష్టమవుతోంది. జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలంటే ఆ ఆదాయం ఎలా వచ్చిందో చెప్పాలి. పాన్, ఆధార్ నంబర్ ఇతర వివరాలను సమర్పించాలి. ఆర్బీఐ, ఆదాయపన్ను, సీబీడీటీ అధికారుల దృష్టిలో పడుతుంది. ఆ వివరాలేవీ వెల్లడిరచేందుకు సుముఖంగా లేనివారు మాత్రమే ఇతర సంస్థల్లో డిపాజిట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వారు డిపాజిట్ చేసేదంతా నల్లధనమే కాబట్టి.
నల్లధనం దాచుకునేందుకు వేదిక !
బడాబాబుల నల్లధనాన్ని గుట్టుచప్పుడు కాకుండా దాచేందుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ ఓ వేదికగా మారిందన్న వాదనకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. అక్రమ డిపాజిట్ల ద్వారా భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తెస్తున్నట్లు స్పష్టమవుతోంది. గతంలోనూ మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు ఇలాంటి వ్యవహారాలనే సాగించినట్లు ఆర్థిక నిపుణులు గుర్తు చేస్తున్నారు. అక్రమ డిపాజిట్లు సేకరించిన సహారా పరివార్ లాంటి సంస్థలు తమ డిపాజిట్‌దారుల వివరాలను గోప్యంగా ఉంచటాన్ని ప్రస్తావిస్తున్నారు. సహారా ఇండియా అక్రమ డిపాజిట్ల వ్యవహారం గుట్టు రట్టు కావడంతో సంస్థ చైర్మన్ సుబ్రతోరాయ్‌కు న్యాయస్థానం జైలు శిక్ష విధించడం గమనార్హం. ఈ నేపథ్యంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో అక్రమ డిపాజిట్‌దారులకు సీఐడీ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
నిబంధనలు పాటిస్తున్నట్లు బుకాయింపు !
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో రూ.కోటి కంటే ఎక్కువ మొత్తం డిపాజిట్ చేసిన వారికి సీఐడీ నోటీసులు జారీ చేయడంతో ఈ కేసులో ఏ1గా ఉన్న సంస్థ చైర్మన్ రామోజీరావు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తమ డిపాజిట్‌దారులకు నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఓ పత్రికా ప్రకటన జారీ చేసింది. తాము చిట్‌ఫండ్స్ చట్టం, ఆదాయపన్ను చట్టాన్ని సక్రమంగా పాటిస్తున్నట్లు అందులో పేర్కొంది. అయితే ఆర్బీఐ, సీబీడీటీ నిబంధనలను పాటిస్తున్నట్లు ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం. చిట్‌ఫండ్ సంస్థలు డిపాజిట్లు సేకరించడాన్ని ఆర్బీఐ అనుమతించడం లేదు. డిపాజిట్ల సేకరణపై సీబీడీటీ కింద పన్నులు చెల్లించాలి. అలా చెల్లించినట్లు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎక్కడా చెప్పడం లేదు. ఆ విషయాన్ని కప్పిపుచ్చేందుకే ఆదాయపన్ను చట్టాన్ని పాటిస్తున్నట్లు మభ్యపుచ్చుతున్నట్లు స్పష్టమవుతోంది.
0 Comments