Ticker

6/recent/ticker-posts

Vizag MP Family Kidnap : విశాఖలో రెచ్చిపోయిన కిడ్నాపర్లు ! ఉలిక్కిపడ్డ తెలుగు రాష్ట్రాలు !


వారికి వ్యవస్థలంటే లెక్కలేదు. మనిషి అంటే జాలి, దయ, ప్రేమ అస్సలు లేదు. వీరంతా మనషుల్లా కనిపించే కసాయోళ్ళు. క్రూర మనస్తత్వంతో వ్యవహరిస్తారు. ఇది రీల్‌ స్టోరీ కాదు. రీయల్‌ స్టోరీ. విశాఖలో అధికార పార్టీ ఎంపీ కుమారుడు, భార్య, ప్రముఖ ఆడిటర్‌ కిడ్నాప్‌ కేసులో నేరగాళ్లు చూపించిన భయానక స్థితిగతులు తలచుకొని బాధితులు ముగ్గురు వణికిపోతున్నారు. తమకు ఎదురైన పరిణామాలు చెప్పి ఆందోళన చెందుతున్నారు. డేగ గ్యాంగ్‌గా చెప్పుకునే ఆ బృందంలో 8 మంది సభ్యులు ఉండగా.. ఒక్కొక్కరూ ఒక్కో రకంగా చిత్రవధ చేస్తూ బాధితులకు చుక్కలు చూపించారు. బాధితుల ఆర్తనాదాలతో పైశాచిక ఆనందం పొందారు.

పక్కా ప్లానింగ్‌తోనే 

కిడ్నాప్‌ నకు గురైంది సాక్షాత్‌ అధికార పార్టీ ఎంపీ కుటుంబసభ్యులు. సీఎం జగన్‌కు సన్నిహితుడైన ఆడిటర్‌ జీవీ. వారు కిడ్నాప్‌నకు గురైంది ముందురోజు. కానీ ఎంపీతో పాటు పోలీసులకు తెలిసింది మరుసటి రోజు. అంటే కిడ్నాపర్లు ఎంత పకడ్బందీగా ప్రణాళిక రూపొందించుకున్నారో అర్ధమవుతోంది. తొలుత ఎంపీ కుమారుడ్ని, ఆ తరువాత ఎంపీ భార్యను, అటు తరువాత ఆడిటర్‌ను ట్రాప్‌ చేశారంటే ఎప్పటి నుంచి రెక్కీ నిర్వహించారో ఇట్టే తెలుస్తోంది. బాధితుల మెడపై కత్తిపెట్టి తమకు అనుకూలంగా మాట్లాడిరచారు. తొలుత ఒక్కడితో ప్రారంభించి.. గంటల వ్యవధిలో ముగ్గురు బాధితులను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారంటే వారి నేర చరిత్ర ఏపాటితో అర్ధమవుతుంది.

నరకం చూపారు 

రెండురోజుల పాటు బాధితులకు నరకం చూపించారు. వారి ముందే గంజాయి, మద్యం తాగుతూ భయానక వాతావరణం సృష్టించారు. ఎంపీ కుమారుడితో పాటు ఆడిటర్‌ ను విచక్షణారహితంగా కొట్టారు. ఆడిటర్‌ను చంపేస్తామని బెదిరించి రాత్రికి రాత్రే రూ.1.70 కోట్లు డ్రైవర్‌ ద్వారా తెప్పించుకున్నారు. బాధితుల ముందే డబ్బులు వాటాలేసుకున్నారు. ఎంపీ భార్య ఒంటిపై ఉన్న బంగారాన్ని కూడా తీసి పంచుకున్నారు. గ్యాంగ్‌స్టర్లు హేమంత్‌, గాజువాక రాజేష్‌లది అగ్రవాటా కాగా.. మిగతాది  ఆరుగురు పంచుకున్నారు. గాజువాక రాజేష్‌ చర్యలను తలచుకొని బాధితులు భయపడుతున్నారు. ఓ నిందితుడైతే ఏకంగా తన ప్రియురాలికే బందీగా ఉన్న ఒకరితో ఫోన్‌ చేయించి మాట్లాడిరచాడు. బయటకు వచ్చాక రూ.40 లక్షలు ముట్టజెబుతానని హామీ ఇప్పించాడు. కిడ్నాప్‌ నగదు నాకు వద్దంటూ ప్రియురాలి భయపడితే.. అది మనకు అప్పుగా ఇవ్వాల్సిన నగదు అని సదరు నిందితుడు చెప్పుకొచ్చాడు.

కారు డిక్కీలో కుక్కి 

అక్కడితో వారి చర్యలు ఆగలేదు. తమకు రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలున్నాయని చెప్పారు. కిడ్నాప్‌లు, దందాలు చేసే ముఠాలతో సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పుకొచ్చారు. ఈ వ్యవస్థలు తమకేం చేయలేవని తేల్చేశారు. మహా అయితే ఓ నెలరోజుల పాటు జైలులో ఉంచుతారని.. తరువాత బయటకు వచ్చి తమ ప్రతాపం చూపుతామని హెచ్చరించారు. కిడ్నాప్‌ ఘటన ప్రాంతం పోలీసులకు తెలియడంతో ఎంపీ కుమారుడ్ని బ్యాటుతో కొట్టి కారు డిక్కీలో కుక్కేశారు. ఆడిటర్‌ జీవిని సైతం కుక్కే ప్రయత్నం చేశారు. అలా అయితే తాను చనిపోతానని కాళ్లావేళ్లా బతిమలాడడంతో కనికరించారు. కారులో చోటిచ్చారు. ఈ విషయాలన్నీ చెబుతూ బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. కళ్లల్లో బందీలుగా ఉన్న నాటి గురుతులు స్పష్టంగా కనిపించాయి.

పోలీసులు ఏం చేయబోతున్నారు ? 

ఇలాంటి కరుడు గట్టిన నేరస్తులు డబ్బు కోసం స్వయంగా అధికార పార్టీకి సంబంధించిన పార్లమెంట్‌ సభ్యుడి కుటుంబ సభ్యులతోనే ఇలా ప్రవర్తించారంటే, సామాన్యుల పరిస్థితి ఇంకేలా ఉంటుందో ఆలోచిస్తేనే వెన్నులో వణుకు పుడుతోంది. ఇప్పటి వరకు తెలియకుండా ఈ గ్యాంగ్‌ ఇలాంటివి ఎన్ని ఘోరాలు చేశారో, బయటకు రాని బాధితులు ఎందరో. ఈ ఒక్క ఘటన రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని కళ్ళకు కడుతుంది. ఇంత తెగింపు వెనుక ఉన్న ధైర్యం ఏమిటి ? వ్యవస్థల్లోని లోపాలను ఆసరా చేసుకుని నేరస్థులు చెలరేగిపోతున్నారు. వీరికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ప్రభుత్వంపైన, పోలీసులపైనా ఉంది.

Post a Comment

0 Comments

Popular Posts

Sri Chaitanya Sisters : శ్రీచైతన్య షెల్‌ కంపెనీల గుట్టు రట్టు !
Sri Chaitanya : వర్సిటీ మూసివేత ! శ్రీచైతన్య ఉద్యోగుల్లో కలవరం ?
JEE MAIN 2025 ఫలితాల్లో మరో సరికొత్త మోసానికి తెరతీసిన శ్రీచైతన్య !
Scholarships : కార్పొరేట్‌ విద్యాసంస్థల బోగస్‌ స్కాలర్‌షిప్‌ ట్రాప్‌  !!
SRI CHAITANYA NEET 2025 : కూలిపోతున్న డాక్టర్‌ కలలు !
JEE ADVANCED 2025 : IIT ర్యాంకుల పేరుతో తల్లిదండ్రుల్ని బకరాల్ని చేస్తున్న శ్రీచైతన్య !
INFINITY META JR APP పేరుతో అడ్డంగా దండుకుంటున్న శ్రీచైతన్య !
Sri Chaitanya : షెల్‌ కంపెనీల పుట్ట...నల్లధనం గుట్ట ....శ్రీచైతన్య !
 SRI CHAITANYA : షెల్‌ కంపెనీలతో  శ్రీచైతన్య డైరెక్టర్ల అంతులేని అక్రమాలు !
Sri Chaitanya Trust : ఇష్టారాజ్యంగా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌లు/ సొసైటీలు !